దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ఓటమిపై భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఓటమికి పూర్తి భాద్యత తనదే అని చెప్పాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం, బ్యాటింగ్‌లో వైఫల్యమే తమ ఓటమిని శాసించిందన్నాడు. తాను, శుభ్‌మన్ గిల్ బాధ్యత తీసుకుని నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. పిచ్ కండిషన్స్‌ను అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యామని, బౌలింగ్‌లో ప్లాన్ బీ కూడా లేదని సూర్య చెప్పుకొచ్చాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో టీ20లో భారత్ 51 పరుగుల తేడాతో ఓడింది.
మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘మేము ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ వికెట్ ఎలా స్పందిస్తుందన్న విషయంపై అప్పుడు పూర్తిగా అవగాహన లేదు. దక్షిణాఫ్రికా బౌలర్లు వేసిన లెంగ్త్‌లు చూసిన తర్వాత అసలు ప్లాన్ ఏంటో అర్థమైంది. డ్యూ కూడా కొంత ప్రభావం చూపింది. మొదటి ప్లాన్ పని చేయకపోతే.. రెండో ప్లాన్ అమలు చేయాల్సి ఉంటుంది. కానీ మాకు ప్లాన్ బీ లేదు. నేను, శుభ్‌మన్ మంచి స్టార్ట్ ఇవ్వాల్సింది. అభిషేక్ శర్మపై ఎక్కువగా ఆధారపడటం సరికాదు. అతడికి కూడా ఆఫ్-డే ఉండొచ్చు. ఈ మ్యాచ్‌లో గిల్ మొదటి బంతికే ఔట్ అయ్యాడు. అప్పుడు నేను బాధ్యత తీసుకోవాల్సింది. క్రీజులో నిలబడితే మ్యాచ్‌ను గెలిపించొచ్చు, కానీ ఆలా జరగలేదు’ అని అన్నాడు.
Also Read: Quinton de Kock History: క్వింటన్ డికాక్ సరికొత్త చరిత్ర.. టీమిండియాపైనే అత్యధికసార్లు..!
‘గత మ్యాచ్‌లో అక్షర్ పటేల్ బాగా ఆడాడు. ఇటీవల టెస్టుల్లో కూడా బాగా బ్యాటింగ్ చేశాడు. అదే నమ్మకంతో ఈ మ్యాచ్‌లోనూ అతడిని బ్యాటింగ్‌లో ముందుకు పంపాం. దురదృష్టవశాత్తూ అది వర్కౌట్ కాలేదు. అయితే అక్షర్ బాగానే ఆడాడు. వచ్చే మ్యాచ్‌లో ఏం చేయాలన్నది కూర్చుని మాట్లాడుకుంటాం. ఈ మ్యాచ్ మాకు ఓ మంచి గుణపాఠం. దక్షిణాఫ్రికా బౌలింగ్ చేసిన విధానం చూసి పాఠం నేర్చుకున్నాం. వచ్చే మ్యాచ్‌లో మరింత మెరుగ్గా ఆడతాం’ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో సూర్య 4 బంతులు ఆడి 5 రన్స్ చేసి అవుట్ అయ్యాడు.
