Suryakumar Yadav: టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో రెండో స్థానంలో కొనసాగుతున్న అతడు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. అతడు టీ20 ప్రపంచకప్ వరకు ఇలాగే ఫామ్ కొనసాగించాలని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆకాంక్షించాడు. తాజాగా అతడు ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు మ్యాక్స్‌వెల్ నెలకొల్పిన ఓ అరుదైన రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ అంతర్జాతీయ టీ20లలో వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో వెయ్యి పరుగుల మార్కును అందుకున్న మూడో క్రికెటర్‌గా నిలిచాడు. 31 ఇన్నింగ్సులలోనే సూర్యకుమార్ వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. గతంలో విరాట్ కోహ్లీ (27 ఇన్నింగ్స్‌లు), కేఎల్ రాహుల్ (29 ఇన్నింగ్స్‌లు) కూడా అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో వెయ్యి పరుగులు చేశారు. ఓవరాల్‌గా అయితే ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ 24 ఇన్నింగ్స్‌లలోనే వెయ్యి పరుగులు పూర్తి చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Read Also:Rohit Sharma: రోహిత్ ముక్కు నుంచి రక్తం.. టీమిండియా కెప్టెన్‌కు ఏమైంది?
మరోవైపు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అతి తక్కువ బాల్స్‌లో వెయ్యి పరుగులు చేసిన క్రికెటర్‌గా సూర్యకుమార్ యాదవ్ కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. అతడు కేవలం 573 బంతుల్లోనే 1000 పరుగుల్ని పూర్తిచేశాడు. గతంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేరిట ఈ రికార్డు ఉండేది. మ్యాక్స్‌వెల్ 604 బంతుల్లో 1000 పరుగులు చేయగా అతడి కంటే సూర్యకుమార్ 30 బంతులు తక్కువగానే వెయ్యి పరుగులు చేయడం విశేషం. ఈ జాబితాలో మూడో స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు కొలిన్ మున్రో ఉన్నాడు. అతడు 635 బంతుల్లో 1000 పరుగులు చేశాడు. నాలుగో స్థానంలో వెస్టిండీస్ ఆటగాడు ఎవిన్ లూయిస్ (640 బంతులు) ఉన్నాడు. ఐదో స్థానంలో శ్రీలంక ఆటగాడు తిసార పెరీరా (654 బంతులు) కొనసాగుతున్నాడు.