Sunil Gavaskar Criticises BCCI Selectors For Dropping Cheteshwar Pujara from IND vs WI Test Series: వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు ఎస్ఎస్ దాస్ సారథ్యంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టుని శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో ‘నయా వాల్’ ఛతేశ్వర్ పూజారాకి చోటు దక్కలేదు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్లో విఫలమయ్యాడనే కారణంతో అతడిని పక్కన పెట్టారు. మరోవైపు ఐపీఎల్ 2023లో పరుగుల వరద పారించిన యువ ప్లేయర్స్ యశస్వీ జైశ్వాల్, రుత్‌రాజ్ గైక్వాడ్‌కు బీసీసీఐ సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. మరోవైపు దేశవాళీ క్రికెట్‌లో గత మూడు సీజన్లుగా పరుగులు చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌ను విస్మరించారు. దాంతో బీసీసీఐ సెలెక్టర్లపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది.
బీసీసీఐ సెలెక్షన్ తీరుపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ప్రదర్శనతో జట్టును ఎంపిక చేసినప్పుడు.. రంజీ ట్రోఫీ నిర్వహించడం ఎందుకు? అని మండిపడ్డాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో బ్యాటర్లు అందరూ విఫలమైనప్పుడు ఛతేశ్వర్ పుజారా ఒక్కడినే ఎందుకు బలి చేశారు అని ప్రశ్నించారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బాగా ఆడారా? అని గవాస్కర్ బీసీసీఐకి చురకలు అంటించాడు. జట్టును ప్రకటించేటప్పుడు బీసీసీఐ సెలెక్టర్లు ఎందుకు మీడియా సమావేశంకు హాజరుకాలేదు సన్నీ ఫైర్ అయ్యాడు.
Also Read: Asian Games 2023 BCCI: బీసీసీఐ యూటర్న్.. ఏషియన్ గేమ్స్ 2023లో భారత క్రికెట్ జట్లు!
‘ఛతేశ్వర్ పుజారాను జట్టు నుంచి ఎందుకు తప్పించారు. బ్యాటింగ్ యూనిట్ మొత్తం విఫలమయినపుడు కేవలం అతడిని మాత్రం ఎందుకు బలిపశువుని చేశారు?. భారత క్రికెట్‌కు ఎన్నో ఏళ్లగా పుజారా సేవలు అందిస్తున్నాడు. జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. పూజారాకి సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లు లేరనే ఉద్దేశంతోనే తప్పించారనిపిస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో పుజారా సరిగ్గా ఆడలేదని జట్టులోకి ఎంచుకోలేదు. మిగితా ఆటగాళ్లు కూడా ఫెయిలయ్యారు కదా?.. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. జట్టును ప్రకటించేటప్పుడు సెలక్షన్ కమిటీ మీడియా సమావేశం ఎందుకు పెట్టడం లేదో నాకు ఆర్ధం కావడం లేదు’ అని సునీల్ గవాస్కర్ అన్నాడు.
‘ఛతేశ్వర్ పుజారా గత కొంత కాలంగా కౌంటీ క్రికెట్ తరచుగా ఆడుతున్నాడు. అందులకే రెడ్‌బాల్ క్రికెట్‌లో మరింత అనుభవం పెరిగింది. రెడ్‌బాల్ క్రికెట్‌పై పుజారాకి పూర్తి అవగహన ఉంది. సరైన ఫిట్‌నెస్ ఉంటే 39-40 సంవత్సరాల వయస్సు క్రికెట్ ఆడొచ్చు. పూజారాకి కూడా 4-5 ఏళ్ల కెరీర్ ఉంది. అజింక్య రహానే మినహా డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో ఏ బ్యాటర్ కూడా పరుగులు చేయలేదు. అయినా పుజారా ఒక్కడినే ఎందుకు బలి చేశారో బీసీసీఐ సెలక్టర్లు సమాధానం చెప్పి తీరాలి’ అని సన్నీ డిమాండ్ చేశాడు.