NTV Telugu Site icon

Ind vs SA: మొదటి వన్డే సఫారీలదే.. సంజు శాంసన్‌ పోరాటం వృథా

South Africa Won

South Africa Won

Ind vs SA: లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది. తొలి వన్డేలోని సఫారీలు విజయాన్ని నమోదు చేసుకున్నారు. భారత జట్టుపై దక్షిణాఫ్రికా 9 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. మొదట టాస్‌ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాట్‌తో బరిలోకి దిగిన ప్రొటీస్ జట్టు 40 ఓవర్లకు 4 వికెట్లను కోల్పోయి 249 పరుగులు చేసి.. 250 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ముంగిట నిలిపింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. డేవిడ్ మిల్లర్ (75), హెన్రిచ్ క్లాసెన్ (74) అజేయ అర్ధ సెంచరీలతో దక్షిణాఫ్రికా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఐదో వికెట్ భాగ‌స్వామ్యానికి డేవిడ్ మిల్లర్‌, హెన్రిచ్ క్లాసిన్ 139 ప‌రుగులు జ‌త చేశారు. డికాక్ ఔటైన త‌ర్వాత దూకుడుగా ఆడిన క్లాసెన్ ప‌రుగుల వేగం పెంచాడు. బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించినా క్యాచ్‌లను చేజార్చడం టీమ్ఇండియా పాలిట శాపమైంది. ఫ‌లితంగా మిల్లర్‌, క్లాసెన్‌ల‌కు ప‌లు ద‌ఫాలు లైఫ్‌లైన్లు ల‌భించాయి.

Ind vs SA: భారత్ లక్ష్యం 250.. అర్థశతకాలు బాదిన మిల్లర్, క్లాసెన్‌

250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 8 పరుగులకే శుభ్‌మన్‌ గిల్, శిఖర్‌ ధావన్‌ రెండు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన రుతురాజ్‌ గైక్వాడ్‌(19), ఇషాన్‌ కిషన్‌(20) నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినా.. సఫారీ బౌలర్ల ధాటికి నిలబడలేకపోయారు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(50) దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 37 బంతుల్లోనే అర్థశతకం బాది కొంచెం ఒత్తిడిని తగ్గించే యత్నం చేశాడు. కానీ ఎంగిడి బౌలింగ్‌లో వెనుదిరగక తప్పలేదు. వికెట్‌ కీపర్ సంజు శాంసన్‌ ఎంత పోరాడినా ఫలితం లేకపోయింది. సంజు శాంసన్‌ 63 బంతుల్లో 86 పరుగులతో రాణించాడు. శాంసన్‌కు తోడుగా శార్దుల్‌ ఠాకూర్‌(33) భారత అభిమానుల్లో ఆశలు చిగురించేలా చేశాడు. అనంతరం వచ్చిన కుల్‌దీప్‌ యాదవ్ వెంటనే వెనుదిరిగాడు. ఒకానొక దశలో భారత్‌ గెలుస్తుందనే ఆశలు చిగురించినా వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో విజయం దక్షిణాఫ్రికాను వరించింది. చివరికి దక్షిణాఫ్రికా 9పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లు లుంగి ఎంగిడి మూడు వికెట్లు, కాగిసో రబాడ 2 వికెట్ల చొప్పున తీయగా.. పార్నెల్, కేశవ్ మహరాజ్, తబ్రేజ్‌ షమ్సి తలో వికెట్‌ తీశారు.