టీమిండియా క్రికెట్ హిస్టరీలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లో ఇరుక్కొని సతమతమవుతున్న ఇండియన్ క్రికెట్‌ను తన కెప్టెన్సీతో మళ్లీ గాడిలో పెట్టాడు. స్వదేశాల్లోనే కాదు విదేశాల్లోనూ చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టాడు. క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత కూడా బీసీసీఐ అధ్యక్షుడిగా దేశంలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేశాడు. బయోపిక్ తీయడానికి నూటికి నూరు శాతం అర్హత ఉన్న క్రికెటర్ సౌరవ్ గంగూలీ. ఇప్పుడతని సినిమా తెరకెక్కబోతోంది. ఈ బయోపిక్ కోసం గంగూలీనే స్వయంగా స్క్రిప్ట్ రాస్తుండటం విశేషం. ఈ సినిమా ఢీల్‌ను ఫైనల్ చేయడానికి ప్రస్తుతం దాదా ముంబైలో ఉన్నాడు.
“స్క్రిప్ట్ నేనే రాస్తున్నా. స్క్రీన్ ప్లే గురించి లవ్ ప్రొడక్షన్ హౌజ్‌లో చర్చిస్తాం. కొన్ని నెలలుగా బయోపిక్‌పై అడుగు ముందుకు పడలేదు. నాతోపాటు ప్రొడక్షన్ హౌజ్ బిజీ షెడ్యూల్ వల్ల వేగం పెరగడం లేదు. ఈసారి వేగంగా ఈ పని పూర్తి కానుంది” అని గంగూలీ వెల్లడించాడు. అయితే ఈ సినిమాలో తన పాత్రలో ఎవరు కనిపించనున్నారన్న విషయం మాత్రం దాదా చెప్పలేదు. దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని అన్నాడు. లవ్ ప్రొడక్షన్స్‌తో సమావేశం తర్వాత దీనిపై ఓ క్లారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పని దాదాపు పూర్తి కావచ్చిందని తెలిపాడు. అయితే ఈ బయోపిక్‌లో దాదా పాత్రలో రణ్‌బీర్ కపూర్ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరికొంత మంది పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.