కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం రాత్రికి లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఒకవేళ గెలిస్తే ఫైనల్ చేరేందుకు సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నుంచి మ్యాచ్ విన్నింగ్ సెంచరీని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 73 పరుగులు చేసి ఫామ్ అందుకున్న కోహ్లీ లక్నోతో జరిగే మ్యాచ్‌లో సెంచరీ చేయాలని సూచించాడు.
ఒకవే కోహ్లీ మంచి స్టాండింగ్ ఇస్తే మిగతా ఆటగాళ్లకు స్వేచ్ఛగా ఆడే వీలు కలుగుతుందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఈతరంలోనే విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు అని.. అందుకే తానేంటో చూపించాల్సిన గొప్ప క్షణం వచ్చేసిందని.. తన అభిమాన జట్టు కప్పు కొట్టాలంటే కోహ్లీ కచ్చితంగా రాణించాలని అక్తర్ సూచించాడు. తనపై వస్తున్న విమర్శలు, ట్రోల్స్‌ను బద్ధలుకొట్టేలాగా విరాట్ కోహ్లీ అంటే ఏంటో ప్రపంచానికి చూపించాలన్నాడు. మ్యాచ్ విన్నింగ్ సెంచరీతో ఆర్సీబీని ఫైనల్‌కు తీసుకువెళ్లాలని అక్తర్ పేర్కొన్నాడు.