Sanju Samson vs Vaibhav Sooryavanshi: అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. అఫ్గానిస్థాన్‌ను 20 ఓవర్లలో 156/8కే పరిమితం చేసింది. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అఫ్గాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక్కడే 44 బంతుల్లో 64 పరుగులు చేశాడు. అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సునాయాస విజయాన్ని అందించాడు. అతడు 32 బంతుల్లోనే 82 పరుగులు బాదాడు. అభిషేక్ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. దీంతో భారత్ కేవలం 13.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించినప్పటికీ.. తుది జట్టు ఎంపికపై ముసరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని బెంచ్‌కు పరిమితం చేయడం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. 15 ఏళ్ల ఈ యువ ఆటగాడు తన దూకుడైన బ్యాటింగ్‌తో ఇప్పటికే క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అయినప్పటికీ తొలి టీ20లో అతడికి అవకాశం ఇవ్వకుండా సంజు శాంసన్‌ను ఓపెనర్‌గా పంపించింది టీమ్ మేనేజ్‌మెంట్. సంజు 10 పరుగులు మాత్రమే చేసి అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో వైభవ్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై మరోసారి చర్చ మొదలైంది. టీమ్ మేనేజ్‌మెంట్ సరైన నిర్ణయం తీసుకోలేదంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు.
ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. అయితే ఆ సిరీస్‌లో ఆడే అవకాశం బుడ్డోడికి రాలేదు. ఆ సిరీస్‌లో భారత్ వైట్‌వాష్ కావడంతో.. వైభవ్‌కు ఛాన్స్ ఇవ్వకపోవడంపై అప్పట్లోనే ప్రశ్నలు తలెత్తాయి. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైభవ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. రెండో టీ20లో అవకాశం దక్కించుకున్న అతడు మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడాడు. అయితే మూడు మ్యాల్లో విఫలమవడంతో చివరి మ్యాచ్‌కు అతడిని పక్కన పెట్టారు. సంజు శాంసన్ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. అయితే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లలో వైభవ్ సత్తా చాటాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత చిన్న వయసులోనే హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో భారత టీ20 జట్టులో అతడి భవిష్యత్తుపై అంచనాలు మరింత పెరిగాయి.
భారత జట్టులో సంజు శాంసన్ ప్రయాణం ఎప్పుడూ సాఫీగా సాగలేదు. గతంలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్.. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లతో పోటీ పడాల్సి వచ్చింది. జట్టులోకి వస్తూ పోతూ ఉండటానికి పోటీ ఒక కారణమైతే.. సంజు ప్రదర్శనల్లో నిలకడ లేకపోవడం కూడా మరో ప్రధాన కారణంగా మారింది. అయితే 2024లో దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు సెంచరీలు సాధించడంతో సంజు తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్‌లో మంచి ఆరంభాలు ఇచ్చాడు. 2026 టి20 ప్రపంచకప్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ రాకతో సంజుకు మరోసారి గట్టి పోటీ ఎదురైంది. మరోవైపు వికెట్ కీపర్-బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ కూడా జట్టులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. దీంతో సంజు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వైభవ్ లాంటి భవిష్యత్ స్టార్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో అతడిపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది.
అయితే ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన సంజు స్థానంపై తుది నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుంది. కానీ అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20లో కేవలం 10 పరుగులకే ఔటవడం మాత్రం అతడి స్థానంపై చర్చకు మరింత ఆజ్యం పోసింది. అభిషేక్ శర్మ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ-సంజు మధ్యే ఓపెనింగ్ స్థానం కోసం ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఒకవైపు 31 ఏళ్ల సంజు తన అనుభవంతో జట్టులో స్థానాన్ని నిలబెట్టుకోవాల్సి ఉండగా.. మరోవైపు 15 ఏళ్ల వైభవ్‌ను భారత క్రికెట్ భవిష్యత్తుగా చూస్తున్నారు. అందుకే రాబోయే మ్యాచ్‌ల్లో టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ముందున్న అతిపెద్ద సవాలు.. అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వాలా? లేక భవిష్యత్ స్టార్‌గా ఎదుగుతున్న వైభవ్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలా? అనేదే.

