Sanju Samson On Competition With Vaibhav Sooryavanshi: అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ అద్భుత విజయం అందుకుంది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు సంజు శాంసన్ (57), అభిషేక్ శర్మ (39) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది. సంజు కేవలం 22 బంతుల్లో 57 పరుగులు చేయడంతో.. టీమిండియా 14.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో సంజు మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ హాఫ్ సెంచరీతో త్వరలో జరిగే ఏషియన్ గేమ్స్ 2026లో కూడా ఓపెనింగ్ రేసులో ముందున్నాడు.
వైభవ్, అభిషేక్ పోటీదారులుగా కనిపించరు:
ఓపెనింగ్ స్థానాల కోసం సంజు శాంసన్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ మధ్య పోటీపై సోషల్ మీడియాలో చర్చ మరోసారి పెరిగింది. ముఖ్యంగా 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్‌తో సంజుకి గట్టి పోటీ అంటూ ఫాన్స్, నెటిజెన్స్ చర్చిస్తున్నారు. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో ఇదే విషయంపై శాంసన్‌ను ప్రశ్నించగా.. తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. పోటీ అనేది బయటివారికి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశాడు. ‘వైభవ్, అభిషేక్ నాకు పోటీదారులుగా కనిపించరు. బయట ప్రపంచానికి మాత్రమే మేమంతా పోటీదారులం. మేమంతా ఒకే జట్టు. దేశం కోసం కలిసి ఆడుతున్నాం. మ్యాచ్ గెలవాలన్నదే మా లక్ష్యం. ఎవరికైనా అవకాశం రాలేదని బాధపడటం, నాకు ఎందుకు ఇవ్వలేదు.. అతడికి ఎందుకు ఇచ్చారు? అని ఆలోచించడం వంటి ప్రతికూల ఆలోచనలు జట్టులో పనికిరావు’ అని సంజు చెప్పాడు.
మాజీ క్రికెటర్లు అంటూనే ఉంటారు:
సోషల్ మీడియాలో మాజీ క్రికెటర్లు చేస్తున్న వ్యాఖ్యలపై కూడా సంజు శాంసన్ స్పందించాడు. ఓపెనింగ్ స్థానంలో సంజు కంటే వైభవ్‌ను ఆడించాలని కొందరు, మరికొందరు అభిషేక్ స్థానంలో వైభవ్‌కు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్న విషయాన్ని ప్రస్తావించాడు. ‘నేను సాధారణంగా సోషల్ మీడియా వ్యాఖ్యలను పట్టించుకోను. అప్పుడప్పుడు మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు నా దృష్టికి వస్తాయి. నేను వైఫైని ఆఫ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ కొన్నిసార్లు వైఫై మళ్లీ ఆన్ అవుతుంది. అప్పుడు మాజీల కామెంట్లు కనిపిస్తాయి. సీనియర్ ప్లేయర్స్ ఏదో ఒకటి చెబుతుంటారు. అది సహజం’ అని శాంసన్ సరదాగా చమత్కరించాడు.
సోషల్ మీడియా ప్రభావం ఉంటుంది:
భారత క్రికెటర్లపై సోషల్ మీడియా ప్రభావం ఉంటుందని సంజు శాంసన్ అంగీకరించాడు. ‘సోషల్ మీడియా ప్రభావం ఉంటుంది. అయితే ప్రతి ఆటగాడు తన మైండ్‌సెట్‌ను స్పష్టంగా ఉంచుకుని, ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టాలి. గతంలో సోషల్ మీడియా వ్యాఖ్యలు నన్ను కూడా బాధించాయి. నేను అనుభవం, పరిపక్వతతో వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాను. నేను మెషీన్‌ను కాదు. మేము రోబోలం కాదు. సోషల్ మీడియా నన్ను ప్రభావితం చేయదు అని చెప్పడం అబద్దమే. కచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఆ విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఇలాంటి ఇన్నింగ్స్ ఆడలేను. ఒక షాట్ ఆడే ముందు నేను ఔటైతే మళ్లీ విమర్శలు మొదలవుతాయి అని ఆలోచిస్తూ ఉంటే నా ఆటపై దృష్టి పెట్టలేను. అందుకే వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతాను’ అని సంజు చెప్పాడు.
వైభవ్‌కు అవకాశం దక్కుతుందా?:
అఫ్గానిస్థాన్‌తో తొలి రెండు టీ20ల్లో సంజు శాంసన్, అభిషేక్ శర్మకు అవకాశాలు లభించగా.. చివరి మ్యాచ్‌లో వీరిలో ఒకరికి విశ్రాంతి ఇచ్చి వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా చివరి మ్యాచ్‌లో జట్టు కూర్పులో మార్పులు ఉండొచ్చనే సంకేతాలు ఇవ్వడంతో.. వైభవ్‌కు అవకాశం దక్కుతుందా అనే ఆసక్తి నెలకొంది. అయితే ఓపెనింగ్ స్థానాల కోసం ఎవరు ఎవరికి పోటీ అన్నదానికంటే.. జట్టు విజయం కోసం అందరూ కలిసి పనిచేయాలన్నదే ముఖ్యమని సంజు శాంసన్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

