జూన్ 9వ తేదీ నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే! అయితే.. రోహిత్ శర్మ సహా విరాట్ కోహ్లీ, బుమ్రాలను విశ్రాంతి పేరిట ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. కొంతకాలం నుంచి తీరిక లేకుండా ఆడుతున్న ఈ సీనియర్లకు విశ్రాంతి తప్పదని చెప్పి, సెలెక్టర్లు తుది జట్టులోకి వారిని తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ స్పందిస్తూ.. రోహిత్ శర్మకు విశ్రాంతీ తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పాడు.
‘‘రోహిత్ శర్మ ఈ సిరీస్ ఆడాలని నేను కోరుకుంటున్నాను. విశ్రాంతి తీసుకోవాలా? వద్దా? అనేది అతని వ్యక్తిగతం. నిజానికి.. విశ్రాంతి అనేది ఓ ఆటగాడు ఎంత అలసటను అనుభవిస్తున్నాడనే విషయంపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఇక్కడ రోహిత్‌కు విరామం అవసరం లేదు. ఇది సుదీర్ఘమైన సిరీస్ కాబట్టి అతడు కచ్ఛితంగా ఆడాల్సిందే. పైగా రోహిత్ శర్మ కెప్టెన్ కూడా.. ఈ విషయాన్ని మర్చిపోకండి. అవును, గత టీ20 లీగ్‌లో అతడు 400కి పైగా పరుగులు చేయలేదు. నిలకడగా రాణించనూ లేదు. కానీ రెండు, మూడు సార్లు మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కావున అతడు దూకుడుగా బ్యాటింగ్ చేయగలడని భావిస్తున్నా. టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్ విన్నర్లు కావాలి’’ అంటూ ఆర్పీ సింగ్ చెప్పుకొచ్చాడు.
కాగా.. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో రోహిత్ శర్మ పెద్దగా రాణించలేదు. మొత్తం 14 మ్యాచుల్లో అతడు 268 పరుగులే చేశాడు. దీనికితోడు అతడు ఈ సీజన్‌లో ఒక్క అర్థసెంచరీ కూడా చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే అతనికి విశ్రాంతి అవసరమని భావించి.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు. విరాట్ కోహ్లీ విషయంలోనూ అదే అభిప్రాయంతో ఎంపిక చేయలేదు. మరోవైపు.. బారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ జూన్ 9వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనుంది.