Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!

  • రోహిత్ శర్మ భవిష్యత్తుపై బీసీసీఐ ఆందోళన
  • హిట్‌మ్యాన్ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి
  • శరీరం పూర్తిగా తట్టుకుంటుందా?
Rohit Sharma Odi Wc

Rohit Sharma Odi Wc

BCCI Worried Over Rohit Sharma Fitness: టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్‌ కప్‌ వరకు రోహిత్ ఫిట్‌గా కొనసాగగలడా? అనే విషయంలో బీసీసీఐ పూర్తిగా నమ్మకంగా లేదని నివేదికలు పేర్కొన్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు హిట్‌మ్యాన్ ఎంపికైనా.. అతడు ఫిట్‌నెస్ టెస్టుల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. రోహిత్ ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు బీసీసీఐ పర్యవేక్షిస్తోంది. వరల్డ్‌ కప్‌కు ఇంకా ఏడాది సమయం ఉండడంతో హిట్‌మ్యాన్ ఫిట్‌నెస్‌, ఫామ్ ఎలా ఉంటుందో అని బీసీసీఐ ఆందోళన చెందుతోందట.

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న రోహిత్ శర్మ.. హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో పలు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో అతడి ఫిట్‌నెస్‌పై బీసీసీఐ మెడికల్ టీమ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు జట్టును ఎంపిక చేసే ముందు సెలెక్టర్లు హిట్‌మ్యాన్ ఫిట్‌నెస్ రిపోర్టులను కూడా కోరినట్లు సమాచారం. వన్డే ఫార్మాట్‌లో బ్యాటింగ్ సహా పూర్తి స్థాయిలో ఫీల్డింగ్ చేయగల శారీరక సామర్థ్యం రోహిత్‌కు ఉందా? అనే అంశంపై సెలెక్టర్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐకి చెందిన ఓ వర్గం తెలిపిన వివరాల ప్రకారం.. ‘రోహిత్ మూడు వారాల పాటు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు రాలేదు. అతడు బరువు తగ్గినా.. హై-పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్‌కు శరీరం పూర్తిగా తట్టుకుంటుందా? అనే ఆందోళన ఉంది. వన్డేల్లో 50 ఓవర్లు ఫీల్డింగ్ చేయాలి. ఐపీఎల్‌లా ఇంపాక్ట్ ప్లేయర్ అవకాశం ఉండదు. 40 ఏళ్లకు దగ్గరవుతున్న సమయంలో శరీరం కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది’ అని పేర్కొన్నట్లు సమాచారం.

రోహిత్ శర్మకు బ్యాకప్‌గా ఓపెనర్లను సిద్ధం చేయడంపై కూడా బీసీసీఐ సెలెక్టర్లు ఇప్పటికే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. యశస్వి జైస్వాల్‌కు ఇంకా వన్డేల్లో తగిన అనుభవం లేకపోవడంతో.. ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా పంపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ రోహిత్ వరల్డ్‌ కప్‌కు అందుబాటులో లేకపోతే.. శుభ్‌మన్ గిల్ లేదా జైస్వాల్‌లో ఎవరికైనా గాయం అయితే మరో ఓపెనర్ సిద్ధంగా ఉండాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో కీలక అంశం ఏమిటంటే.. రోహిత్, విరాట్ కోహ్లీ ఎంపికలను ఇకపై ఒకే కోణంలో చూడకూడదని బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం కోహ్లీ ఫిట్‌నెస్, ఫామ్ మిగతా బ్యాటర్ల కంటే మెరుగ్గా ఉందని బీసీసీఐ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు రోహిత్ ఇటీవలి కాలంలో దూకుడైన బ్యాటింగ్ చేయడం లేదన్న అసంతృప్తి కూడా టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నట్లు సమాచారం.

‘ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్, ఫామ్ అద్భుతంగా ఉన్నాయి. కానీ ఇకపై కోహ్లీ, రోహిత్‌ శర్మలను ఒకేలా చూడలేం. రోహిత్ భవిష్యత్తుపై బీసీసీఐ మెడికల్ టీమ్‌తో చర్చించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఫిట్‌నెస్, ఫామ్ లేకుంటే.. 2027 వరల్డ్‌ కప్‌లో రోహిత్ ఆడటం కష్టమే? అని క్రికెట్ నిపుణులు అంటున్నారు. కోహ్లీ మాత్రం తప్పక ఆడుతాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వన్డే వరల్డ్‌ కప్‌ గెలవడం హిట్‌మ్యాన్ కల అన్న విషయం తెలిసిందే. చూడాలి మరి ఏం జరుగుతుందో.