BCCI Warns Selectors Amid Rohit Sharma Retirement Speculation: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై గత 2-3 రోజులుగా జరుగుతున్న ప్రచారం భారత క్రికెట్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇంగ్లండ్‌తో ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే హిట్‌మ్యాన్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుందంటూ.. పలు కథనాలు రావడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. అయితే ఈ ప్రచారంపై ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ.. రోహిత్ ఇంకా భారత వన్డే జట్టు ప్రణాళికల్లోనే ఉన్నాడని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రోహిత్ శర్మ భవిష్యత్తుకు సంబంధించిన సమాచారం మీడియాకు లీక్ కావడంపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు క్రిక్‌బజ్ తన కథనంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యులు ఇకపై మీడియాతో ఎలాంటి అనధికారిక సంభాషణలు చేయొద్దని బోర్డు స్పష్టమైన సూచనలు చేసిందట. జట్టు అంతర్గత విషయాలు బయటకు రావడం సరైంది కాదని, ఇలాంటి లీకులు అనవసర ఊహాగానాలకు కారణమవుతున్నాయని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆడాలన్న లక్ష్యంతో కొనసాగుతున్నాడు. అయితే ఇటీవల అతడి ఫామ్ బీసీసీఐ సెలెక్టర్లను ఆకట్టుకోలేదని నివేదికలు పేర్కొంటున్నాయి. గత ఎనిమిది వన్డే ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ 241 పరుగులు మాత్రమే చేయగా.. సగటు 30.12గా ఉంది. ఈ గణాంకాల నేపథ్యంలో కొందరు సెలెక్టర్లు భవిష్యత్తు కోసం యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే అభిప్రాయంలో ఉన్నట్లు సమాచారం.
గత నెల అఫ్గానిస్థాన్ సిరీస్‌కు ముందే సెలక్షన్ కమిటీలోని కొందరు సభ్యులు రోహిత్ శర్మతో మాట్లాడి.. భవిష్యత్తు ప్రణాళికల్లో అతడికి స్థానం ఉండకపోవచ్చని సంకేతాలు ఇచ్చినట్లు ఎన్‌డీటీవీ పేర్కొంది. ఈ చర్చల గురించి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు కూడా సమాచారం ఇచ్చినట్లు రాసుకొచ్చింది. అయినప్పటికీ బీసీసీఐ ఉన్నతాధికారులతో జరిగిన చర్చల అనంతరం రోహిత్‌కు అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్‌లలో అవకాశం లభించింది. అయితే ఇంగ్లండ్‌తో తొలి రెండు వన్డేల్లో వరుసగా 11, 26 పరుగులే చేయడంతో రోహిత్ ఫామ్‌పై మళ్లీ ప్రశ్నలు తలెత్తాయి. దీంతో సెలెక్టర్లు మరోసారి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటివరకు బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

