NTV Telugu Site icon

రహానెపై వేటు.. వైస్ కెప్టెన్ పదవి కూడా అతడికే..?

టీమిండియాకు సంబంధించి టెస్టుల్లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే తుదిజట్టులో స్థానం పోగొట్టుకున్న రహానె.. త్వరలో వైస్ కెప్టెన్ పదవిని కూడా కోల్పోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో రహానె వరుస వైఫల్యాలే అతడి కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. కేవలం టెస్టులు మాత్రమే ఆడుతున్న అతడు.. రెండేళ్లుగా పేలవ ఫామ్‌ను కనపరుస్తున్నాడు. గత ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్టులో సెంచరీ మినహా అతడు చెప్పుకోదగ్గ విధంగా ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ అతడు విఫలమయ్యాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు మాత్రమే చేయడంతో రెండో టెస్టుకు జట్టులో స్థానం కోల్పోయాడు.

Read Also: అజాజ్ పటేల్ ప్రపంచ రికార్డు… 10కి 10 వికెట్లు తీసిన కివీస్ స్పిన్నర్

ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్‌గా రహానెను తప్పించి ఆ స్థానంలో రోహిత్ శర్మను నియమించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మరో వారం రోజుల్లో వెలువడనుందని సమాచారం. ఇప్పటికే రోహిత్ శర్మ టీ20 మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. త్వరలో టెస్టులకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అందుకోనున్నాడు. త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఈ పర్యటనలోనే రోహిత్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి.