టీ20ల్లో చివరి ఓవర్‌లో అద్భుతాలు చేసే టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. రంజీ ట్రోఫీ 2025/26 సీజన్ ఎలైట్ గ్రూప్ ఎలో భాగంగా కోయంబత్తూరులో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్న రింకూ భారీ శతకంతో చెలరేగాడు. 247 బంతుల్లో 17 ఫోర్లు, ఆరు సిక్సర్లు బాది ఉత్తరప్రదేశ్ జట్టు ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. రింకూ ఇన్నింగ్స్‌తో యూపీ ఖాతాలో మూడు పాయింట్లు సాధించింది. డ్రా అయిన మ్యాచ్‌లో తమిళనాడుకు ఒక పాయింట్ లభించింది.
ఉత్తరప్రదేశ్ 149 పరుగుల వద్ద మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో రింకూ సింగ్ క్రీజులోకి వచ్చాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. అప్పటివరకు బంతిని గింగరాలు తిప్పిన తమిళనాడు స్పిన్నర్లు విద్యుత్, సాయి కిషోర్‌లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఆచితూచి ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ వేగాన్ని పెంచాడు. మొదట్లో కాస్త సంశయం పాటించిన రింకూ.. క్రీజులో కుదురుకున్నాక తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. 247 బంతుల్లో 17 ఫోర్లు, 6 సిక్సర్లతో 176 పరుగులు చేశాడు. శివమ్ మావి (54)తో కలిసి 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దాంతో ఉత్తరప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 460 పరుగులు చేసింది. తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 455 రన్స్ చేసింది.
Also Read: Shai Hope: చరిత్ర సృష్టించిన షాయ్ హోప్.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే తొలిసారి!
అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌తో మ్యాచ్‌లో రింకూ సింగ్ (165) భారీ శతకం బాదాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన రింకూ 341 పరుగులు చేశాడు. భారత జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్‌లో స్పిన్ ఆడటానికి ఇబ్బంది పడుతున్న సమయంలో రింకూ ఇన్నింగ్స్‌కు ప్రాముఖ్యతను సంతరించుకుంది. టెస్ట్ అరంగేట్రం దిశగా రింకూ అడుగులు పడుతున్నాయి. తాను టెస్ట్ కూడా ఆడగలనని బీసీసీఐ సెలెక్టర్లకు రింకూ గట్టి మెసేజ్ పంపాడు.