Ricky Ponting: కారు యాక్సిడెంట్ కారణంగా తీవ్రంగా గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ ఇప్పట్లో కోలుకునే ఛాన్స్ లేదని తెలుస్తోంది. దీంతో అతడు ఐపీఎల్-2023కి అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో పంత్ గైర్హాజరీపై స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్.. అతడి సేవలు కోల్పోవడం బాధాకరమని వెల్లడించాడు. అయితే ఒకవేళ పంత్ శరీరం ప్రయాణం చేయడానికి సహకరిస్తే అతడిని తమతో పాటు మ్యాచ్‌లకు తీసుకువెళ్తామని చెప్పాడు. పంత్ లాంటి సరదా మనిషి డగౌట్‌లో ఉండటం వల్ల జట్టుకు మేలు జరుగుతుందని తెలిపాడు.
Read Also: BPL 2023: 18 బాల్స్‌లో 73 రన్స్.. ఇదెక్కడి మాస్‌రా బాబు!
‘పంత్ అంటే నాకిష్టం. ఈ విషయాన్ని కొద్ది రోజుల ముందే అతడికి ఫోన్‌లోనూ చెప్పాను. యాక్సిడెంట్ విషయం తెలిసి చాలా బాధపడ్డా. నేను కాదు అతని గురించి తెలిస ప్రతీ ఒక్కరూ భయపడ్డారు. పంత్‌ను ఎవరైనా ప్రేమిస్తారు. అతను త్వరగా అందరినీ కలుపుకుపోతాడు. వీలైనంత త్వరగా అతడు గ్రౌండ్‌లో అడుగుపెడతాడని ఆశిస్తున్నా. పంత్‌లాంటి ప్లేయర్ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. మరో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కోసం అన్వేషిస్తున్నాం. ఓ కోచ్‌గా డగౌట్‌లో పంత్ నా పక్కనే ఉండాలనుకుంటా. అతను ఫిట్‌గా లేకున్నా.. ఆడకున్నా మా పక్కనే ఉంటే బాగుంటుంది. ఓ కెప్టెన్‌గా, ఆటగాడిగా అతను ఎంతో సరదాగా ఉంటాడు. ఆటగాళ్లలో స్పూర్తిని నింపుతాడు. తన మాటలతో నవ్వులు పూయిస్తాడు. అతను ప్రయాణించగలిగితే ఐపీఎల్ జరిగినన్ని రోజులు మా డగౌట్‌లో పక్కనే కూర్చోబెట్టుకుంటా. ఢిల్లీ క్యాంప్ ప్రారంభమైనప్పటి నుంచే అతన్ని జట్టులో భాగం చేస్తాం’ అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
గతేడాది డిసెంబర్ 30న రూర్కీ సమీపంలో పంత్ ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్‌కు స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన తర్వాత శస్త్రచికిత్స అవసరం ఉండటంతో అతన్ని ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడే అతనికి మోకాలి ఆపరేషన్ జరిగింది.