Team India: న్యూజిలాండ్ పర్యటన తర్వాత టీమిండియా బంగ్లాదేశ్ టూర్ వెళ్లనుంది. అక్కడ మూడు వన్డేలు, రెండు టెస్టులను భారత జట్టు ఆడనుంది. ఈ పర్యటనకు గతంలో జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు స్థానం కల్పించారు. అయితే అతడు బంగ్లాదేశ్ వెళ్లడం ఇప్పుడు అనుమానంగా మారింది. జడేజా గాయంపై సస్పెన్స్ నెలకొంది. ఇంకా అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని.. దీంతో బంగ్లాదేశ్ పర్యటనకు దూరంగా ఉంటాడని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.
Read Also: భారత యుద్ధ చరిత్ర.. ఎన్ని యుద్ధాల్లో గెలిచిందో తెలుసా..?
ఆసియా కప్లో ఆడుతున్న సమయంలోనే రవీంద్ర జడేజా మోకాలి గాయం తిరగబెట్టింది. దీంతో బౌలింగ్ చేయడం కష్టంగా మారడంతో అతడు ఆసియా కప్ మధ్యలోనే జట్టును వీడి ఆస్పత్రికి వెళ్లాడు. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ కారణంగానే టీ20 వరల్డ్ కప్, న్యూజిల్యాండ్ పర్యటనలకు జడేజా దూరంగా ఉన్నాడు. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్లో అతడు లేని లోటు స్పష్టంగా కనిపించింది. బంగ్లాదేశ్ పర్యటన సమయానికి జడేజా పూర్తిగా కోలుకుంటాడని సెలక్టర్లు భావించారు. కానీ అతడు ఈ టూర్లో పాల్గొనే అవకాశాలు లేవని బీసీసీఐ అధికారులు చెప్తున్నారు. టెస్టులు, వన్డేలలో భారతజట్టుకు జడేజా సేవలు ఎంతో వెలకట్టలేనివి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ రేసులో టీమిండియా ఉండాలంటే ఇప్పటి నుంచి భారత్ ఆడే ఆరు టెస్టుల్లో గెలవాలి. అలా అయితేనే ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్ పర్యటనకు జడేజా దూరం అవుతాడని వస్తున్న వార్త అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తోంది.