శ్రీలంకతో తొలి టెస్టులో జడేజా డబుల్ సెంచరీ ముంగిట ఉన్న సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంపై పలు విమర్శలు వచ్చాయి. కెరీర్‌లో జడేజా తొలిసారి డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పుడు రోహిత్ ఇలా చేయడం సరికాదనే కామెంట్లు వినిపించాయి. అయితే ఈ విమర్శలపై రవీంద్ర జడేజా స్పందించాడు. తానే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయమని రోహిత్‌కు చెప్పినట్లు జడేజా స్పష్టం చేశాడు. దీంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది.
భారత్ 574 పరుగుల వద్దకు చేరుకునేసరికి శ్రీలంక ఆటగాళ్లు చాలా అలసిపోయినట్లు కనిపించారని.. అందుకే వెంటనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి లంకను బ్యాటింగ్‌కు ఆహ్వానిస్తే వికెట్లు తీసుకునే అవకాశం ఉంటుందని తాను భావించినట్లు జడేజా వెల్లడించాడు. ఈ నేపథ్యంలో తానే డ్రెస్సింగ్ రూమ్‌కు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాలని ప్రతిపాదించినట్లు జడేజా తెలిపాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ వెనుక ద్రవిడ్, రోహిత్ హస్తం అనే ఆరోపణలను జడేజా కొట్టిపారేశాడు. చివరకు జడేజా సూచన మేరకు రోహిత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడనే విషయం స్పష్టమవుతోంది.
