R Ashwin: ముందుగానే చెప్పాలి కదా.. ఇప్పుడు చెప్తే ఎలా.. బీసీసీఐపై అశ్విన్ ఫైర్!

  • రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై ప్రచారం
  • రిటైర్మెంట్‌పై స్పందించిన మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్
  • పక్కన పెట్టాలనుకుంటే ముందుగానే చెప్పాలి
Rohit Sharma Retirement Buzz

Rohit Sharma Retirement Buzz

R Ashwin Slams BCCI Over Rohit Sharma Retirement Buzz: స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై జరుగుతున్న ప్రచారంపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే.. హిట్‌మ్యాన్‌ చివరి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుందనే ఊహాగానాల మధ్య యాష్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 2027 వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల్లో రోహిత్, విరాట్ కోహ్లీకి స్థానం ఉండదని బీసీసీఐ సెలెక్టర్లు భావించి ఉంటే.. ఆ విషయాన్ని ముందుగానే చెప్పాల్సిందని సూచించాడు. ఒకే ఒక్క చెత్త సిరీస్ ఆధారంగా సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తును నిర్ణయించడం సరైన విధానం కాదని అశ్విన్ పేర్కొన్నాడు.

తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆర్ అశ్విన్ మాట్లాడుతూ… ‘సెప్టెంబర్, అక్టోబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్ వెళ్లనుంది. ఆ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అనుభవం జట్టుకు ఎంతో అవసరం. యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మాట నిజమే. కానీ 2027 ప్రపంచ కప్ కోసం రోహిత్, విరాట్‌ను పక్కన పెట్టాలనుకుంటే.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే వారికి ఆ విషయాన్ని చెప్పాల్సింది. ప్రపంచ కప్ సమీపిస్తున్న వేళ చెబితే ఎలా?’ అని ప్రశ్నించాడు.

సీనియర్ ఆటగాళ్లతో నిజాయితీగా మాట్లాడటం చాలా ముఖ్యమని అశ్విన్ పేర్కొన్నాడు. ‘ఏ ఆటగాడికైనా ఇక ముందుకు వెళ్లాలనుకుంటున్నామని చెప్పడం బాధ కలిగిస్తుంది. కానీ స్పష్టమైన కమ్యూనికేషన్ అవసరం. ఆస్ట్రేలియా పర్యటనలో కోచ్ నాతో కూడా ఇలాగే మాట్లాడారు. జట్టు కొత్త దిశగా వెళ్లాలని భావిస్తున్నామని చెప్పారు. నేను ఆ నిర్ణయాన్ని అంగీకరించాను. ఒక చెత్త సిరీస్ ఏ ఆటగాడికైనా రావచ్చు. అలాంటి సమయంలో మద్దతు ఇవ్వాల్సిందే తప్ప వెంటనే తీర్పు ఇవ్వకూడదు’ అని చెప్పాడు.

ప్రస్తుతం వన్డే ప్రపంచ కప్‌కు ఇంకా ఏడాది సమయం కూడా లేని వేళ ఈ రిటైర్మెంట్‌ చర్చలు ఎందుకు మొదలయ్యాయో తనకు అర్థం కావడం లేదని ఆర్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. ‘రోహిత్, విరాట్ ఇద్దరూ ఇప్పటికీ జట్టుకు కీలక ఆటగాళ్లే. మార్పు చేయాలనుకుంటే దానికి సరైన సమయం ఉండాలి. ప్రపంచ కప్‌కు 10-12 నెలల ముందు ఇలాంటి చర్చలు రావడం మంచి సంకేతం కాదు’ అని అన్నాడు. ఇదిలా ఉండగా రోహిత్ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలను బీసీసీఐ ఇప్పటికే ఖండించింది. లార్డ్స్ వన్డే అతడి చివరి మ్యాచ్ కాదని బోర్డు స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ అంశంపై చర్చలు కొనసాగుతుండగా.. అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.