Prabath Jayasuriya Breaks Axar Patel Record: శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఓ అరుదైన ఘనత సాధించాడు. పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లు తీయడంతో.. టెస్ట్ కెరీర్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో ఆడిన అరంగేట్రం టెస్ట్‌లో ఇతను ఏకంగా 12 వికెట్లు (ఫస్ట్ ఇన్నింగ్స్ – 6/118, సెకండ్ ఇన్నింగ్స్ – 6/59) పడగొట్టాడు. దీంతో.. లంక తరఫున డెబ్యూ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత పాక్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 9 వికెట్లు (5/82, 4/135), రెండో టెస్ట్‌లో 8 వికెట్లు (3/80, 5/117) సాధించాడు. మొత్తంగా తొలి మూడు మ్యాచ్‌ల్లో కలిపి 29 వికెట్లు సాధించాడు.
ఈ క్రమంలోనే భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ (27) రికార్డ్‌ని బద్దలుకొట్టి.. ఆస్ట్రేలియా మాజీ బౌలర్ చార్లెస్ టర్నర్ (29)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు ప్రభాత్. 31 వికెట్లతో (తొలి టెస్ట్‌లోనే విండీస్‌పై 16 వికెట్లు) భారత మాజీ లెగ్ స్పిన్నర్ నరేంద్ర హిర్వాని అగ్రస్థానంలో ఉన్నారు. ఇదే సమయంలో ప్రభాస్ మరో రికార్డ్‌ని కూడా తన పేరిట లిఖించుకున్నాడు. తొలి ఆరు ఇన్నింగ్స్‌ల్లో కలిపి.. నాలుగు సార్లు ఫైఫర్ (ఐదు వికెట్లు) నమోదు చేసి.. అక్షర్ పటేల్‌తో సమంగా నిలిచాడు. 30 ఏళ్ల లేటు వయసులో టెస్ట్ ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన ఈ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్.. తన వైవిధ్యమైన స్పిన్ మాయాజాలంతో సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ, ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో నయా సెన్సేషన్‌గా అవతరించాడు.