తనను జట్టులోకి ఎంపిక చేయలేదని ఓ యువ క్రికెటర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం పాకిస్థాన్ క్రికెట్‌లో కలకలం రేపింది. పాకిస్తాన్‌లోని సదరన్ సింధ్ ప్రావిన్స్ కు చెందిన షోయబ్ అనే దేశవాళీ క్రికెటర్ ఫాస్ట్ బౌలర్‌గా సేవలందిస్తున్నాడు. అయితే తాజాగా ప్రకటించిన దేశవాళీ జట్టులో అతడికి స్థానం లభించలేదు. దీంతో కోచ్ తీరు పట్ల షోయబ్ తీవ్ర మనస్తాపం చెందాడు. మానసిక వేధనతో గదికే పరిమితం అయ్యాడు. ఈ నేపథ్యంలో షోయబ్ కత్తితో తన మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంటర్ సిటీ చాంపియన్ షిప్ కోసం కోచ్ తనను ఎంపిక చేయకపోవడంతోనే షోయబ్ ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.
షోయబ్ తన నివాసంలోనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. బాత్‌రూంలో చేయికోసుకున్న అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం షోయబ్ పరిస్థితి విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా యువ క్రికెటర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇదే తొలిసారి కాదు. 2018లోనూ పాకిస్థాన్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. కరాచీ అండర్-19 జట్టు నుంచి తనను తొలగించడంతో ముహమ్మద్ జర్యాబ్ అనే యువ క్రికెటర్ ఉరేసుకుని చనిపోయాడు. అప్పట్లో ఈ అంశం పాకిస్థాన్ క్రికెట్‌లో లుకలుకలను బహిర్గతం చేసింది. ఇప్పుడు మరో యువ క్రికెటర్ సూసైడ్ ఎటెంప్ట్ చేసుకోవడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Rumeli Dhar: రిటైర్మెంట్ ప్రకటించిన మరో టీమిండియా మహిళా క్రికెటర్