NTV Telugu Site icon

Virat Kohli: “ఓడినా పర్వాలేదు, కోహ్లీ సెంచరీ చేశాడు”.. ఇస్లామాబాద్‌లో ఫ్యాన్స్ సంబరాలు..

Virat Kohli

Virat Kohli

Virat Kohli: క్రికెట్ ప్రపంచంలోనే గ్రేటెస్ట్ రైవలరీ‌గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ని చూస్తారు. రెండు దేశాల్లో కోట్లాది మంది అభిమానులు కూడా తమ తమ జట్లు గెలవాలని, తమ స్టార్లు సెంచరీలతో చెలరేగాలని కోరుకుంటారు. దశాబ్ధాలుగా ఆ శతృత్వం కొనసాగుతూనే ఉంది. అయితే, పాకిస్తాన్‌కి ఒకే ఒక చింత ఏంటంటే, ఇప్పటి వరకు ఐసీసీ టోర్నమెంట్లలో భారత్‌ని కొట్టలేకపోతోంది. పాక్‌తో పోలిస్తే మెరుగైన ట్రాక్ రికార్డ్ భారత్ సొంతం.

Read Also: Belagavi: కర్ణాటక-మహారాష్ట్ర మధ్య వైరానికి కేంద్రంగా ‘‘బెళగావి’’.. అసలేంటి ఈ వివాదం..

తాజాగా, దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్‌పై మరోసారి ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ ‘‘కింగ్’’ ఇన్నింగ్స్ మరోసారి పాకిస్తాన్‌ని మట్టికరిపించింది. ఏ దశలో కూడా పాక్ భారత్‌కి పోటీ ఇవ్వలేకపోయింది. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌తో పాటు అందరూ అదరగొట్టారు. పాకిస్తాన్ విధించిన 242 పరుగుల టార్గెట్‌ని 42.3 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. అప్పటి వరకు పెద్దగా ఫామ్‌లోని విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ అనగానే సెంచరీతో చెలరేగిపోయాడు. తాను ఆడిన చివరి బంతిని ఫోర్‌‌గా మార్చి, అటు సెంచరీని, ఇటు భారత్‌కి విజయాన్ని సాధించిపెట్టాడు. కోహ్లీకి అండగా శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ నిలిచారు.

అయితే, భారత ప్లేయర్ అయినప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ లవర్స్ విరాట్ కోహ్లీని తమ స్టార్లతో సమానంగా, ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువగా భావిస్తారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 51 సెంచరీ కొట్టగానే పాకిస్తాన్‌లోని ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాక్ జట్టు అభిమాని, కోహ్లీ సెంచరీ కొట్టగానే ఆనందంతో కేరింతలు వేసింది. ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ క్రికెట్ లవర్స్, కోహ్లీ సెంచరీ చేయగానే సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తమ జట్టు ఓడిపోతుందన్న బాధ కన్నా, కోహ్లీ సెంచరీ సాధించడంపై పాక్‌లోని కొందరు ఆనందంగా ఉండటం గమనార్హం.