పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ అంతర్జాతీయ క్రికెట్ లో చెలరేగిపోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టును కెప్టెన్ గా ముందుండి నడిపిస్తున్న బాబర్ మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ లో మూడు అర్ధశతకాలు చేసిన ఏకైక కెప్టెన్ గా బాబర్ నిలిచాడు. అయితే ఈ ప్రపంచ కప్ లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు పాకిస్థాన్ ఆడింది. అందులో మొదటి మ్యాచ్ లోనే భారత్ పై హాఫ్ సెంచరీ చేసిన బాబర్ ఆ తర్వాత రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ పై చేయలేదు. ఇక మూడో మ్యాచ్ లో ఆఫ్ఘానిస్తాన్ పై మళ్ళీ హాఫ్ సెంచరీతో రెచ్చిపోయిన బాబర్ తాజాగా నిన్నటి మ్యాచ్ లో నమీబియా పై 49 బంతుల్లో 70 పరుగులు చేసాడు. దాంతో ఈ టోర్నీలో మూడో అర్ధశతకాని తన ఖాతాలో వేసుకున్నాడు బాబర్. ఇక పాకిస్థాన్ కు ఈ ప్రపంచ కప్ సూపర్ 12 స్టేజ్ లో ఒకే ఒక్క మ్యాచ్ స్కాట్లాండ్ తో మిగిలివుంది.