Kohli-Rohit: దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చూపిన అద్భుత ఫామ్‌పై మాజీ భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా తన యూట్యూబ్ చానల్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు 2027 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో తప్పనిసరిగా ఉండాలని, జట్టులో మొదటి ఇద్దరి పేర్లు వీరేవి అవ్వాలని సూచించారు. రోహిత్ శర్మ సిరీస్‌లో రెండు అర్ధ శతకాలతో ఆకట్టుకోగా, విరాట్ కోహ్లీ వరుస రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో చెలరేగాడని తెలిపాడు. అయితే, యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం మంచిదే కానీ, వారి కోసం రోహిత్- విరాట్‌లాంటి అనుభవజ్ఞులను పక్కకు తప్పించడం పెద్ద పెద్ద టోర్నీల్లో ప్రమాదకరమని హర్భజన్ సింగ్ హెచ్చరించాడు.
అయితే, రోహిత్, విరాట్‌లకంటే గొప్పవారు ఎవరున్నారు?.. వీరి చుట్టూ జట్టును నిర్మించాలి.. జట్టులో అనుభవాన్ని కోల్పోతే కీలక మ్యాచ్‌ల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని పేర్కొన్నారు. ఇది వీరి చివరి వరల్డ్‌కప్ కావొచ్చు.. కనుక తప్పకుండా ఈ ఇద్దరు ఆడాలని చెప్పుకొచ్చాడు. గత వరల్డ్‌కప్ ఫైనల్‌లో స్లో పిచ్ కారణంగా భారత్ అవకాశాలు కోల్పోయిందని గుర్తు చేసిన హర్భజన్.. రోహిత్ నాయకత్వంలో భారత జట్టు ప్రదర్శన అద్భుతమని కొనియాడాడు. ఇక, 2024- 25 వన్డేల్లో విరాట్ 651 పరుగులతో, రోహిత్ 650 పరుగులతో భారత్ తరఫున అగ్రస్థానాల్లో నిలిచారు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా ఈ జంట అత్యధిక పరుగులు చేశారు.
