ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవ్వడానికి ముందు నుంచే, ఇదే మహేంద్ర సింగ్ ధోనీది చివరి ఐపీఎల్ లీగ్ అనే ప్రచారం ఊపందుకుంది. ఇక సీజన్ ప్రారంభంలో రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో.. ఆ ప్రచారం నిజమేనని అంతా అనుకున్నారు. ఈ టోర్నీ సగంలో మళ్ళీ చెన్నై పగ్గాల్ని ధోనీ అందుకున్నప్పటికీ.. అతనిపై భవిష్యత్తుపైనే సరైన స్పష్టత రాలేదు. వచ్చే సీజన్ ఆడుతాడా? లేదా? అనేది మిస్టరీగానే ఉండిపోయింది.
ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి (మే20) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా.. ధోనీని వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ అతని భవిష్యత్ గురించి ప్రశ్నించాడు. ఇందుకు తాను 2023 ఐపీఎల్‌లోనూ తప్పకుండా ఆడుతానని ధోనీ క్లారిటీ ఇచ్చాడు. ‘‘2023లో తప్పకుండా ఆడతా.. ఇందుకు ఒక కారణం ఉంది. చెన్నైలో ఆడకుండా, అభిమానులకు కృతజ్ఙతలు తెలపకుండా వీడ్కోలు పలకడం అన్యాయమే అవుతుంది. ముంబైలో ఆటగాడిగా నాకెంతో ప్రేమాభిమానాలు దక్కాయి. కానీ.. చెన్నై ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పకుండా నిష్క్రమిస్టే బాగుండదు. వచ్చే ఏడాది టీ20లీగ్ దేశమంతా జరుగుతుందని ఆశిస్తున్నా. అప్పుడు అన్ని చోట్లా అభిమానులకు కృతజ్ఞతలు చెప్పొచ్చు’’ అని ధోనీ చెప్పుకొచ్చాడు.
అంతేకాదు.. 2023 సంవత్సరం చివరిది అవుతుందా? లేదా? అన్నది ఇప్పుడే నిర్ణయించలేమని ధోనీ పేర్కొన్నాడు. ఎందుకంటే, ఇంతకుముందులాగా భవిష్యత్తును మనం ఊహించలేమని తెలిపాడు. వచ్చే ఏడాది మాత్రం తప్పకుండా ఆడతానని మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ధోనీ మాటల్ని బట్టి చూస్తుంటే, ఆ తర్వాతి సంవత్సరం కూడా కొనసాగేలా కనిపిస్తున్నాడు. అదే నిజమైతే, అభిమానులకు అంతకుమించిన గుడ్ న్యూస్ ఇంకేముంటుంది?