అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఒకే ఓవర్లో భారీగా పరుగులు రాబట్టడం అంటే మాములు విషయం కాదు. అద్భుత ప్రతిభకు తోడు ధైర్యం, టైమింగ్ కూడా చాలా అవసరం. టీ20 క్రికెట్లో చాలా మంది బ్యాటర్లకు ఈ ప్రతిభ ఉంది. ఆ లిస్టులో టీమిండియా బ్యాటర్లు కూడా ఉన్నారు. అందరికంటే ముందు పొట్టి ఫార్మాట్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాడు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. ఈ జాబితాలో తాజాగా మరో ఆల్‌రౌండర్ శివమ్ దూబే చేరాడు. ఓ ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల లిస్ట్ ఓసారి చూద్దాం.
2007లో డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ ఆడిన ఇన్నింగ్స్‌ను ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేరు. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో యువరాజ్ వరుసగా ఆరు సిక్సర్లు బాది.. ఏకంగా 36 పరుగులు పిండుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత 2024లో హైదరాబాద్ వేదికగా సంజూ శాంసన్ మరో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్ స్పిన్నర్ రిషాద్ హొస్సేన్ వేసిన ఓ ఓవర్లో సంజూ 30 పరుగులు రాబట్టి..ఈ జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. క్లాస్‌తో పాటు పవర్‌ను కలిపిన అతని బ్యాటింగ్ అభిమానులను ఉర్రూతలూగించింది.
Also Read: Team India Biggest Defeats: స్వదేశంలో టీమిండియాకు భారీ షాక్.. అతిపెద్ద పరాజయాల లిస్ట్ ఇదే!
2024లో గ్రోస్ ఐలెట్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ తనదైన స్టైల్లో విధ్వంసం సృష్టించాడు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన ఓ ఓవర్లో 28 పరుగులు సాధించి.. ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాడు. స్టార్క్ లాంటి మేటి బౌలర్‌ను రోహిత్ అల్లాడించిన తీరును టీమిండియా ఫాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. నిన్న విశాఖపట్నం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శివమ్ దూబే (65; 23 బంతుల్లో 3×4, 7×6) శివాలెత్తాడు. స్పిన్నర్ ఇష్ సోధి వేసిన ఓవర్లో 28 పరుగులు సాధించి.. ఔరా అనిపించాడు. యువరాజ్ సింగ్ మొదలు నేటి తరం బ్యాటర్ల వరకూ చూస్తే.. ఈ రికార్డులు భారత టీ20 క్రికెట్ బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పుతున్నాయి.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక రన్స్ చేసిన రికార్డు డారియస్ విస్సర్ పేరుపై ఉంది. 2024లో నలిన్ నిపికో బౌలింగ్‌లో డారియస్ 39 రన్స్ చేశాడు. ఈ జాబితాలో యువరాజ్ సింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. కీరన్ పొలార్డ్, రోహిత్ శర్మ, దీపేంద్ర సింగ్ ఐరీ, నికోలస్ పూరన్, మనన్ బషీర్ కూడా ఒకే ఓవర్లో 36 రన్స్ చేశారు. అలీ రజా 35 రన్స్ చేయగా.. టిమ్ లూయిస్ సీఫెర్ట్, ర్యాన్ బర్ల్ 34 పరుగులు చేశారు.