దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. టీమ్‌ఇండియాపై దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. తొలి టీ20 మ్యాచ్ లో భారత్ పై దక్షిణాఫ్రికా ఏ మాత్రం ఒత్తిడి లేకుండా సునాయాసంగా గెలిచేసింది. దక్షిణాఫ్రికా విజయంలో ప్రధానంగా మిల్లర్, రస్సీ వాండర్ డుసెన్ గురించి చెప్పుకోవాలి. వీరిద్దరూ క్రీజులో కుదురుకుని మరో వికెట్ పడకుండా.. వచ్చిన ప్రతీ బంతిని చీల్చి చెండాడారు. డుసెన్ 46 బంతుల్లో 75 పరుగులు చేయగా, డేవిడ్ మిల్లర్ 31 బంతుల్లో 64 పరుగులు రాబట్టుకున్నాడు.
నిజానికి డుసెన్ ముందే అవుట్ అవ్వాల్సింది. కానీ, అతడు ఇచ్చిన క్యాచ్‌ను శ్రేయస్ అయ్యర్ పట్టుకోలేకపోయాడు. చేతి నుంచి జారి పడిపోయింది. దీనికి భారత్ జట్టు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. భారత్ మూల్యం చెల్లించుకున్నట్టు స్వయంగా డుసెన్ కూడా వ్యాఖ్యానించాడు. డుసెన్ మొదటి 30 బంతులకు చేసిన పరుగులు కేవలం 29. ఇక ఆ తర్వాత మొదలైంది బ్యాటుతో ఊచకోత. తదుపరి 16 బంతుల్లో అతడు 46 పరుగులు (4 సిక్స్‌లు, 5 ఫోర్లు) చేశాడంటే ఏ పాటి విధ్వంసమో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి మ్యాచ్ ను దక్షిణాఫ్రికా వైపు తిప్పాడు. డుసెన్ 29 స్కోరుతో ఉన్న సమయంలో 16వ ఓవర్లో అతడు కొట్టిన షాట్‌ను శ్రేయస్ అయ్యర్ జారవిడిచాడు.