తమ జట్టు ఫైనల్‌కి చేరిందంటే, ఏ ఆటగాడైనా సంతోషంగా ఉండకుండా ఉంటాడా? కానీ, మాథ్యూ వేడ్ మాత్రం సంతోషంగా లేనని బాంబ్ పేల్చాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్‌కి చేరినా.. తాను సంతోషంగా లేనని, వ్యక్తిగతంగా ఈ సీజన్ తనకు చాలా చిరాకు కలిగిస్తోందని అన్నాడు. ఇందుకు ప్రధాన కారణం.. తాను సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడమేనని వెల్లడించాడు.
‘‘నాకు ఈ సీజన్ వ్యక్తిగతంగా చిరాకు తెప్పిస్తోంది. నేను సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడమే అందుకు కారణం. మంచి షాట్లతో ఇన్నింగ్స్‌ని ఆరంభించినా, వాటిని భారీ స్కోరుగా మలచలేకపోతున్నా. రాజస్థాన్‌తో జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో 35 పరుగులు చేసేంతవరకూ నాది చెత్త బ్యాటింగ్‌లానే అనిపించింది. టీ20లో దూకుడుగా ఆడితేనే కలిసొస్తుంది. ఆ ప్లాన్‌లో నేను పూర్తిగా విఫలమయ్యా. అయితే.. కీలకమైన ఫైనల్‌కు ముందు కాస్త మంచి బ్యాటింగ్ చేయడం ఆనందం కలిగించింది’’ అని మాథ్యూ వేడ్ చెప్పుకొచ్చాడు.
ఆటగాడిగా విఫలమైనప్పుడు కెప్టెన్ మద్దతు ఉండాలని, ఆ విషయంలో హార్దిక్ నుంచి తనకు మంచి సపోర్ట్ లభించిందని మాథ్యూ తెలిపాడు. మొదట్నుంచి ఏడో స్థానం దాకా తమ జట్టులో బ్యాటింగ్ చేసే సత్తా ఉందని, రషీద్ ఖాన్ రూపంలో ఏడో నంబర్ వరకూ విధ్వంసకర బ్యాటింగ్ తమకు ఉండడం అదృష్టంగా భావిస్తున్నానన్నాడు. ఈసారి కప్ గెలిచేది గుజరాత్ టైటాన్స్ జట్టేనని మాథ్యూ వేడ్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా.. ఈ లీగ్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన వేడ్, 171 పరుగులే చేశాడు. అతని అత్యధిక స్కోరు 35 మాత్రమే!