Javed Miandad Comments On Match Fixing: టీ20 వరల్డ్‌కప్ -2022 టోర్నీలో పాకిస్తాన్ జట్టు పూర్తిస్థాయిలో ఉన్నతమైన ప్రదర్శనను కనబర్చలేదనే చెప్పుకోవాలి. జింబాబ్వే లాంటి చిన్న జట్టు చేతిలో ఘోర పరాజయం చవిచూడటమే అందుకు నిదర్శనం. ఇక రప్ఫాడించాల్సిన ఫైనల్ మ్యాచ్‌లో అయితే, బ్యాటింగ్ పరంగా ఘోరంగా విఫలమైంది. అందుకే, పాక్ మాజీలు తమ దేశ జట్టుని మొదటి నుంచి ఏకాపారేస్తూ వస్తున్నారు. ఈసారి చాలా డిజప్పాయింట్ చేశారంటూ పెదవి విరిచారు. ఈ క్రమంలోనే తాజాగా జావెద్ మియాందాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విదేశీ కోచ్‌లను పాక్ క్రికెట్ బోర్డు నియమించడాన్ని తప్పుపట్టిన ఆయన.. మ్యాచ్ ఫిక్సింగ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుత ఆటగాళ్ల భవిష్యత్తుపై అనిశ్చితి ఏర్పడుతోందని, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ ఘటనలకు దారితీస్తుందని బాంబ్ పేల్చాడు.
‘‘గతంలో పాకిస్తాన్ తరుపున ఆడిన క్రికెటర్లు, రిటైర్ అయ్యాక ఖాళీగా ఉండిపోయారు. ఇక్కడ నేను నా గురించి చెప్పడం లేదు. నాకు ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ, నేను వాటిని అంగీకరించలేదు. ప్రస్తుత ఆటగాళ్ల సంగతేంటి? వాళ్లు ఎక్కడికి వెళ్లినా రాణించలేకపోతున్నారు. ఈరోజు నేను ఆడకపోతే, రేపు నా పరిస్థితి ఏమవుతుంది? అనే భయం వారిని ఫిక్సింగ్‌కు పాల్పడేలా ప్రేరేపిస్తుంది. ప్రతీ ఒక్కరు తమ కెరీర్ కోసం భయపడుతున్నారు’’ అంటూ జావెద్ మియాందాద్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి భయాల వల్లే.. గతంలో పాక్ క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌లు జరిగాయని కుండబద్దలు కొట్టారు. విదేశీ కోచ్‌లను తీసుకోవడం వల్లే, ఆటగాళ్ల భవిష్యత్తు అయోమయంగా తయారైందన్నదే ఆయన అభిప్రాయం. వాళ్లను కాకుండా, మనోళ్లనే నియమిస్తే.. పరిస్థితుల్లో మార్పు రావొచ్చని ఆయన చెప్తున్నాడు. మరి, పాక్ బోర్డు దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో?