Javed Miandad: పాకిస్తాన్ లో జరగబోయే ఆసియా కప్ క్రికెట్ టోర్నీకి భారత జట్టు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కారాలుమిరియాలు నూరుతోంది. పాక్ మాజీ ఆటగాళ్లు భారత్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐ నియంతలా ప్రవర్తిస్తోందని పాక్ మాజీ ఆటగాడు, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. బీసీసీఐ తన వైఖరి ఇప్పటికే స్పష్టం చేయగా.. పాకిస్తాన్ జట్టు కూడా తాము ఇండియాలో నిర్వహించే వరల్డ్ కప్ మ్యాచుల నుంచి వైదొలుగుతామని బెదిరిస్తోంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే తాము ఇండియాలో ఆడాలంటే మ్యాచులను కోల్‌కతా మరియు చెన్నైలలో నిర్వహించాలని పాక్ ఆడుగుతున్నట్లు వార్తలు వచ్చాయి.
Read Also: Nayanthara: ఆ ఇద్దరి హీరోలకు నయన్ టెస్ట్.. పాస్ అయ్యేది ఎవరు..?
ఇదిలా ఉంటే పాక్ మాజీ స్టార్ ఆటగాడు జావెద్ మియాందాద్ ఈ వివాదంపై స్పందించారు. భారత్ లో పాకిస్తాన్ జట్టు సందర్శించేందుకు ఏ సమస్య ఉండదని, అయితే ప్రస్తుతం పాకిస్తాన్ కు రావడం భారత్ వంతు అని అన్నారు. ‘‘ భద్రతను మరిచిపోండి.. మరణం మీ విధి అయితే అది ఖచ్చితంగా వస్తుంది. జీవితం, మరణం అల్లా చేతిలో ఉన్నాయి’’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ రోజు భారత్ పిలిస్తే మేం వెళ్తాం, మేమే చివరిసారిగా భారత్ కు వెళ్లాం, కానీ భారత్ ఇక్కడికి రాలేదు, ఇప్పుడు వారి వంతు వచ్చింది అని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అన్నారు. 2012 నుంచి భారత్, పాక్ లు ద్వైపాక్షిక సిరీస్ లో తలపడలేదు.
గత వారం పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ బీసీసీఐ అహంకారంగా వ్యవహరిస్తోందని, సూపర్ పవర్ లా ప్రవర్తిస్తోందని నిందించాడు. క్రికెట్ ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉన్న భారత్ ప్రవర్తించే తీరు దురహంకారంగా ఉందని, దీనికి కారణం వారికి నిధులు ఎక్కువగా ఉండటమే అని, వారు ఎవరితో ఆడాలి, ఎవరితో ఆడకూడదని అనే విషయాలను సూపర్ పవర్ గా నిర్దేశిస్తుందని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు.