Ishan Kishan: పాకిస్థాన్‌పై గెలుపు ఎప్పుడూ ప్రత్యేకమే.. ఇక టీ20 ప్రపంచకప్‌లో రెచ్చిపోతాం!

  • పాకిస్థాన్‌పై గెలుపు ఎప్పుడూ ప్రత్యేకమే
  • బంతిని గమనిస్తూ సింపుల్‌గా ఆడా
  • ఇక టీ20 ప్రపంచకప్‌లో రెచ్చిపోతాం
Ishan Kishan

Ishan Kishan

Ishan Kishan on India vs Pakistan Win: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేమే అని టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ చెప్పాడు. పాకిస్థాన్ మ్యాచ్‌లో విజయం సాధించడం భారత జట్టుకు భారీ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని తెలిపాడు. ప్రారంభంలో పిచ్ నెమ్మదిగా ఉందని, తన బలాలపై నమ్మకం ఉంచి ఆడానని తెలిపాడు. బంతిని గమనిస్తూ సింపుల్‌గా ఆడటం, ఫీల్డ్‌ను ఉపయోగించుకోవడం తన ప్రణాళిక అని కిషన్ వివరించాడు. టీ20 ప్రపంచకప్‌ 2026లో ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 61 పరుగుల తేడాతో గెలిచింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కిషన్‌ హాఫ్ సెంచరీ (77; 40 బంతుల్లో 10×4, 3×6) బాదాడు.

ఇషాన్ కిషన్ మాట్లాడుతూ… ‘ఆఫ్‌సైడ్ ఆటను మెరుగుపరచేందుకు చాలా కష్టపడ్డా. ఆఫ్‌సైడ్‌లో బాగా ఆడితే బౌలర్లు నేను కోరుకున్న లైన్‌లో బౌలింగ్ చేస్తారు. అందుకే గ్యాప్‌లను లక్ష్యంగా చేసుకుని షాట్లు ఆడా. పెద్ద గ్రౌండ్ కావడంతో గ్యాప్‌లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కనీసం రెండు పరుగులు తీసేలా ప్లాన్ చేశా. మ్యాచ్‌కు ముందు 160–170 మధ్య స్కోరు చేస్తే మంచి టోటల్ అవుతుందని నాకు అనిపించింది. అదే లక్ష్యంతో ఇన్నింగ్స్‌ను నిర్మించా. పాకిస్థాన్‌పై గెలవడం టోర్నీ మిగతా మ్యాచ్‌లలో జట్టుకు మంచి మోమెంటమ్ ఇస్తుంది’ అని చెప్పాడు.

Also Read: Bill Gates-AP: గన్నవరం చేరుకున్న బిల్‌గేట్స్‌.. ఏపీ నేతలతో కీలక భేటీ!

‘కొత్త బంతితో జస్ప్రీత్ బుమ్రా ఎప్పుడూ ప్రమాదకారే. బుమ్రా అద్భుతం. అతడి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే హార్దిక్ పాండ్య ప్లాన్ ప్రకారం కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పేసర్లకు పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించలేదు. మా పేసర్లు ఆరంభంలోనే అద్భుతంగా రెండు ఓవర్లు వేశారు. అప్పుడే మ్యాచ్‌పై పట్టు సాధించాం. జట్టు సమిష్టి ప్రదర్శన కారణంగానే విజయం సాధించాం. పాకిస్థాన్‌పై విజయం జట్టుకు ఎంతో ముఖ్యం. అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ టోర్నీలో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాము’ అని ఇషాన్ కిషన్ స్పష్టం చెప్పకొచ్చాడు.