Team India: హైదరాబాదీ ఆటగాడు మహ్మద్ సిరాజ్ కొంతకాలంగా టీమిండియాలో నిలకడగా రాణిస్తున్నాడు. దీంతో క్రమంగా జట్టులో తన స్థానాన్ని సుస్ధిరం చేసుకుంటున్నాడు. టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న సిరాజ్ ఇప్పుడు వైట్‌బాల్ క్రికెట్‌లోనూ అదరగొడుతున్నాడు. తాజాగా శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో అతడు అద్భుతంగా రాణించాడు. చివరి మ్యాచ్‌లో 4 వికెట్లతో శ్రీలంక 73 పరుగులకే కుప్పకూలడంలో కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో సిరాజ్ 9 వికెట్లతో సత్తా చాటాడు. ఈ క్రమంలో సిరాజ్‌పై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఏడాది కాలంగా సిరాజ్ బౌలింగ్‌లో మరింత పదును పెరిగిందని.. వైట్‌బాల్ క్రికెట్‌లో బుమ్రా లేని లోటు అతడు తెలియనివ్వడంలేదని జాఫర్ అన్నాడు. వైట్‌బాల్ బౌలర్‌గా సిరాజ్ ఎంతో పురోగతి సాధించాడని జాఫర్ అభిప్రాయపడ్డాడు.
Read Also: Plane Accident: నేపాల్ విమాన ప్రమాదం.. ఫేస్ బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్
ఏడాది కాలంగా వైట్‌బాల్ క్రికెట్‌లో సిరాజ్ పుంజుకున్న తీరు అద్భుతం అని జాఫర్ అన్నాడు. ఒక రకంగా సిరాజ్ ఇలా బౌలింగ్ చేస్తుంటే బుమ్రాను మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ కలగదన్నాడు. బుమ్రాను మిస్ అవుతున్నామన్న ఆలోచన లేకుండా టీమ్‌కు సిరాజ్ తీసుకొస్తున్న విలువెంతో అర్థం చేసుకోవచ్చని జాఫర్ పేర్కొన్నాడు. మరోవైపు ఉమ్రాన్ మాలిక్ సేవలను కూడా జాఫర్ కొనియాడాడు. తొలి రెండు మ్యాచ్‌లలో కలిపి మాలిక్ 5 వికెట్లు పడగొట్టాడని.. ఎక్కువ పరుగులు ఇచ్చినా అతడి బౌలింగ్ ఆకట్టుకుందని తెలిపాడు. కానీ మాలిక్‌తో పోలిస్తే సిరాజ్ ప్రతిసారీ దూకుడు చూపించాడని.. బ్యాటర్లతో నువ్వా నేనా అన్న తరహాలో తలపడ్డాడని జాఫర్ అన్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో రెండు వైపులా బంతిని స్వింగ్ చేస్తూ చాలా నైపుణ్యంతో సిరాజ్ బౌలింగ్ చేశాడని జాఫర్ చెప్పాడు.