Vaibhav Sooryavanshi: నేను ఆ మూడింటి పైనే ఫోకస్ చేస్తా.. ప్రత్యర్థి బౌలర్లు ఏం ప్లాన్ చేసినా నాకు అనవసరం!

  • వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్
  • సెంచరీలు మళ్లీ మళ్లీ వస్తాయి కానీ ట్రోఫీ రాదు
  • ప్రత్యర్థి బౌలర్లు ఏం ప్లాన్ చేసినా నాకు అనవసరం
Vaibhav Sooryavanshi Match Preparation

Vaibhav Sooryavanshi Match Preparation

Vaibhav Sooryavanshi Reveals His Match Preparation: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సులతో 97 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. బుధవారం న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌హెచ్)పై విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన వైభవ్.. రాజస్థాన్ రాయల్స్‌ (ఆర్ఆర్)ను క్వాలిఫయర్-2కు చేర్చాడు. ముందుగా రాజస్థాన్‌ 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేయగా.. ఛేదనలో సన్‌రైజర్స్ 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన బుడ్డోడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తాను వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచించనని, తన దృష్టి మొత్తం జట్టును ఛాంపియన్‌గా నిలపడం పైనే ఉంటుందని వైభవ్ స్పష్టం చేశాడు. ప్రత్యర్థి బౌలర్లు ఏం ప్లాన్ చేసినా తనకు అనవసరం అని, నార్మల్ క్రికెట్ ఆడుతాముందుకు సాగుతా అని చెప్పుకోచ్చాడు. ‘మేము మ్యాచ్ గెలిస్తే ఆ పాజిటివ్ ఇంటెంట్‌ను అలాగే ముందుకు తీసుకెళ్తాం. గతం గురించి ఎక్కువగా ఆలోచించకుండా నెక్స్ట్ మ్యాచ్‌పై దృష్టి పెడతాం. ఇదే విధంగా తర్వాతి మ్యాచ్ కూడా గెలిచి ఫైనల్‌కు చేరాలని భావిస్తున్నాం. తదుపరి మ్యాచ్‌ గురించి ఆలోచిస్తాను కానీ మరీ ఎక్కువగా కాదు. ప్రస్తుతం ఆడుతున్న మ్యాచ్‌పైనే ఫోకస్ పెడతాను. అవసరమైతే నా ఆటలో ఏం మెరుగుపరచుకోవాలో చూసుకుంటాను. కానీ ఓవర్ థింక్ చేయను’ అని తెలిపాడు.

మ్యాచ్‌కు ముందు తన ప్రిపరేషన్ గురించి కూడా వైభవ్ వివరించాడు. ‘ప్రత్యర్థి జట్టులో ఉన్న బౌలర్లు ఎవరు?, ఈ పిచ్‌పై వారిని ఎలా ఎదుర్కోవాలి?, బౌండరీలు ఎంత పెద్దగా ఉన్నాయి? లాంటి విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తాను. నేను పాజిటివ్ ఇంటెంట్‌తో ఆడితే బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తాను. ఎప్పుడూ గేమ్‌ను డామినేట్ చేయాలనుకుంటాను’ అని తెలిపాడు. చిన్న వయసులోనే ఇంత స్పష్టమైన ఆలోచనతో ఆడుతున్న వైభవ్ మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఎలిమినేటర్ మ్యాచ్‌లో సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో ఔటైన వైభవ్.. అప్పటివరకు తనకు రికార్డు గురించి అసలు తెలియదని చెప్పాడు. ‘నేను ఔటైన తర్వాతే సెంచరీకి దగ్గర్లో ఉన్నానని తెలిసింది. ఆ సమయంలో నా ఫోకస్ మొత్తం జట్టుకు ఎంత ఎక్కువగా సహాయం చేయగలనన్న దానిపైనే ఉంది. సెంచరీలు మళ్లీ మళ్లీ వస్తాయి. కానీ ప్రస్తుతం మా లక్ష్యం ట్రోఫీ గెలవడం. అదే నాకు ముఖ్యం’ అని స్పష్టం చేశాడు. ప్రత్యర్థి జట్లు తన కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయన్న విషయంపై కూడా వైభవ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘ప్రత్యర్థి ఏమి ప్లాన్ చేస్తుందో నేను ఆలోచించను. అది వాళ్ల పని. నేను నా ప్లాన్‌పైనే దృష్టి పెడతాను. సాధారణ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాను’ అని తెలిపాడు. క్వాలిఫయర్-2లో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తే ఆర్ఆర్ ఫైనల్‌కు చేరడం ఖాయం.