Site icon NTV Telugu

Tilak Varma: ఎక్కువ సమయం లేదు.. తిలక్‌ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

Tilak Varma Century

Tilak Varma Century

ఐపీఎల్‌ 2026ను విజయంతో ఆరంభించిన ముంబై ఇండియన్స్‌.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయాలు చవిచూసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ముంబైపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోమవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరంభం చూస్తే.. ఇది కూడా పోయినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ మన తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ సంచలన శతకంతో జట్టుకు ఆదుకున్నాడు. 45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులతో 101 నాటౌట్‌గా నిలిచాడు. నమన్‌ ధీర్‌ (45; 32 బంతుల్లో) కూడా రాణించడంతో ముంబై 5 వికెట్లకు 199 పరుగులు చేసింది. ఛేదనలో అశ్వని కుమార్‌ (4/24), మిచెల్ శాంట్నర్‌ (2/16), జస్ప్రీత్ బుమ్రా (1/15), ఘజన్‌ఫర్‌ (2/17)ల ర్చిపోవడంతో గుజరాత్ 15.5 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ అయింది.

మెరుపు ఇన్నింగ్స్ ఆడిన తిలక్‌ వర్మను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. తన కెరీర్‌లో తొలి సెంచరీ ఎప్పటికీ ప్రత్యేకమని పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రతి మ్యాచ్ ఎంతో కీలకమైందని, ఇక మిగిలిన సమయం తక్కువగా ఉండటంతో ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని భావించానని చెప్పాడు. ‘తొలి సెంచరీ ఎప్పటికీ ప్రత్యేకమే. నిజం చెప్పాలంటే ఇది మా జట్టుకు చాలా కీలకమైన ఇన్నింగ్స్. ఇక నుంచి మాకు ఎక్కువ సమయం లేదు. ప్రతి మ్యాచ్ చాలా ముఖ్యమైనది. గత ఐదు మ్యాచ్‌ల్లో నేను క్రీజ్‌లో ఎక్కువ సమయం గడపలేకపోయాను. అందుకే ఈ మ్యాచ్‌లో క్రీజ్‌లో నిలబడాలని నిర్ణయించుకున్నాను. మొదటి 20 బంతులు జాగ్రత్తగా ఆడుతూ ముందుకు సాగాను. నా సామర్థ్యం తెలుసు, కాస్త సెట్ అయిన తర్వాత దూకుడుగా ఆడాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని తిలక్ చెప్పాడు.

Also Read: TN Elections 2026: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. తెలుగు ఓటర్లే లక్ష్యంగా సీఎం చంద్రబాబు రోడ్ షో!

‘జట్టు పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆడాను. వికెట్స్ పడిన సమయంలో నేను నిలకగా ఆడాను. ప్రాథమిక విషయాలపైనే దృష్టి పెట్టాను. నెను అన్ని షాట్లు ఆడగలను కానీ.. జట్టుకు అవసరమైనప్పుడు మాత్రమే కొన్నింటిని ఆడతాను. ఒత్తిడిలో బ్యాటింగ్ చేస్తుంటే, మీ నైపుణ్యాలపై నమ్మకం ఉండాలి. అదే నేను ఈరోజు చేశాను, అందుకే మంచి ఫలితం వచ్చింది. నమన్‌ బాగా ఆడాడు. నమన్‌తో భాగస్వామ్యం కీలకం. నమన్ పాజిటివ్‌గా కలిసొచ్చింది. నేను ఇన్నింగ్స్‌ను కొనసాగించిన తీరు నాకు చాలా గర్వంగా ఉంది. వచ్చే మ్యాచులలో కూడా రాణించేందుకు ప్రయత్నిస్తాం. ఇకపై మాకు డూ ఆర్ డై లాంటిది. గెలిచేందుకే బరిలోకి దిగుతాం’ అని తిలక్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version