Suresh Raina Slams RCB Over IPL Title: ఐపీఎల్‌లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఐదేసి టైటిల్స్ సాధించాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ రెండుసార్లు ఛాంపియన్‌గా నిలవగా.. రాజస్థాన్ రాయల్స్, డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ ఒక్కోసారి టైటిల్ గెలిచాయి. ఐపీఎల్ ఆరంభం నుంచి ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ సహా మూడేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఒక్క టైటిల్ గెలవలేదు. ఈ జట్లు టైటిల్ గెలవలేకపోవడానికి కారణం ఏంటనే దానిపై టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘ఐపీఎల్‌లో కొన్ని జట్లు ఎక్కువగా పార్టీలు ఇస్తుంటాయి. ఇప్పటి వరకు 2-3 జట్లే టైటిల్ గెలవలేదు. చెన్నై ఎప్పుడూ పార్టీలు ఇవ్వలేదు. అందుకే ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా, రెండు సార్లు ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీని గెలుచుకుంది. ముంబై కూడా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది. లేట్ నైట్ పార్టీల వల్ల చాలా నష్టం కలుగుతుంది. ఆలస్యంగా నిద్రపోతే మరుసటి రోజు ఎలా ఆడతారు?’ అని సురేశ్ రైనా ప్రశ్నించాడు.
Also Read: Priyanka Chopra: టైగర్‌తో నా కోరిక నెరవేరింది: ప్రియాంక చోప్రా
‘మే, జూన్‌లో ఎండలు తీవ్రంగా ఉంటాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచుల్లో చురుగ్గా ఉండాలంటే.. విశ్రాంతి చాలా అవసరం. రాత్రంతా పార్టీలు చేసుకుంటే ఎలా ఆడుతారు. భారత జట్టు తరఫున ఆడేటప్పుడూ ఇలాంటి విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి. సరిగ్గా బ్యాటింగ్ చేయకున్నా లేదా బౌలింగ్ చేయకున్నా జట్టులో కెప్టెన్ మనల్ని ఎందుకు ఉంచుతాడు?. నేను రిటైర్మెంట్ ఇచ్చేశా. కాబట్టి నేను ఎప్పుడైనా పార్టీ చేసుకోవచ్చు’ అని మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా సరదాగా అన్నాడు. ఐపీఎల్‌లో రైనా 205 మ్యాచులు ఆడి 5528 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. రైనా చెన్నై తరఫున ఆడిన విషయం తెలిసిందే.