SRH vs RR Eliminator: కళ్లు చెదిరే గణాంకాలు వర్మ.. ఎలిమినేటర్‌లో బౌలర్లకు అతి పెద్ద సవాల్‌ ఆ ఇద్దరే!

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ బ్యాటర్ల హవా
  • బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అభిషేక్-వైభవ్
  • ఎలిమినేటర్‌లో అందరికళ్లు ఆ ఇద్దరి పైనే
Abhishek Sharma, Vaibhav Suryavanshi

Abhishek Sharma, Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi and Abhishek Sharma Stats in IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో భారత యువ బ్యాటర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ తమ విధ్వంసక బ్యాటింగ్‌తో అభిమానులను అలరిస్తున్నారు. పవర్ హిట్టింగ్, అద్భుతమైన స్ట్రైక్‌రేట్లు, భారీ ఇన్నింగ్స్‌లతో ఈ ఇద్దరూ ప్రత్యర్థి బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ ఇద్దరి గణాంకాలు చూసిన తర్వాత ఈరోజు ముల్లాన్‌పుర్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో పరుగుల వరద ఎంతలా ఉండబోతోందో అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడి 563 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోర్ 135 నాటౌట్. 43.30 సగటుతో పాటు 196.85 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. ఈ గణాంకాలు చూస్తే.. అభిషేక్ దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సీజన్‌లో 5 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ బాదాడు. ఒకసారి మాత్రమే నాటౌట్‌గా నిలిచిన అభి.. రెండు సార్లు డక్ అవుట్ అయ్యాడు. పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను మలుపుతిప్పే సామర్థ్యం అభిషేక్‌ను ప్రత్యేక ఆటగాడిగా నిలబెట్టింది.

కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ కూడా అద్భుత గణాంకాలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున 14 మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 583 పరుగులు బాదాడు. అతడి అత్యధిక స్కోర్ 103. 213.55 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సీజన్‌లో వైభవ్ మూడు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు. బుడ్డోడు ఒక్కసారి మాత్రమే డక్ అవుట్ అయ్యాడు. మొదటి బంతి నుంచే బౌలర్లపై దాడి చేయడం వైభవ్ ప్రత్యేకతగా మారింది.

అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఇద్దరూ ఈ సీజన్‌లో 500కు పైగా పరుగులు చేయడంతో పాటు 190కి పైగా స్ట్రైక్‌రేట్‌తో రాణించడం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లకు పెద్ద పాజిటివ్‌గా మారింది. దూకుడుగా ఆడే ఈ ఇద్దరు బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లకు పెద్ద సవాలుగా మారారు. ఈ కీలక సమరంలో వైభవ్‌, అభిని బౌలర్లు ఎంత మేరకు కట్టడి చేయగలరన్న దానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. ఆర్చర్‌ vs అభిషేక్, వైభవ్ vs కమిన్స్‌ పోరు ఎలా ఉంటుందో చూడాలి. ఇటీవలి మ్యాచ్‌లలో సన్‌రైజర్సే పైచేయిగా ఉంది.