Nitish Kumar Reddy Said I never forget hiting Six in Rabada’s Bowling: పంజాబ్ కింగ్స్ పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, అందుకే తాను దూకుడగా ఆడేందుకు ఎక్కువగా ప్రయత్నించలేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తెలిపాడు. స్పిన్నర్లు వచ్చాక వారిపై ఎటాక్ చేయాలని తాను ముందే అనుకున్నానని చెప్పాడు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ బౌలింగ్‌లో తాను సిక్స్ కొట్టడంను ఎప్పటికీ మరిచిపోలేనని నితీశ్ రెడ్డి పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలవడంతో నితీశ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. నితీశ్ చెలరేగడంతో 39/3 ఉన్న హైదరాబాద్ స్కోరు చివరికి 182కు చేరుకుంది.
పంజాబ్ కింగ్స్‌పై నితీశ్ రెడ్డి 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో ఒక వికెట్ కూడా పడగొట్టాడు. మూడు ఓవర్లలో ఓ వికెట్ పడగొట్టి.. 33 రన్స్ ఇచ్చాడు. ఆల్‌రౌండ్ షో చేసిన నితీశ్.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా నితీశ్ రెడ్డి మాట్లాడుతూ… ‘సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం ఆనందంగా ఉంది. ఈ ప్రదర్శన నాకు పెద్ద బూస్ట్ లాంటిది. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగా. నాపై నాకు పూర్తి నమ్మకం ఉండాలని నాకు నేనే చెప్పుకున్నా’ అని తెలిపాడు.
‘పంజాబ్ కింగ్స్ సీమర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. అందుకే దూకుడగా ఆడేందుకు ఎక్కువగా ప్రయత్నించలేదు. స్పిన్నర్లు వస్తారని నాకు తెలుసు. వారిపై దాడి చేయాలని ముందే అనుకున్నా. ఆ ప్రణాళిక ప్రకారమే ఆడాను. కగిసో రబాడ బౌలింగ్‌లో సిక్స్ కొట్టడం ఎప్పటికీ మరిచిపోలేను. టోర్నీలో పేసర్లు స్లో బౌన్సర్లతో ఇబ్బంది పెడుతున్నారు. వాటిని ఎదుర్కోవడం చాలా కష్టం. నేను బౌలింగ్ చేసేటప్పుడు కూడా ఇలానే బంతులేశా. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఇలానే ఆడాలనుకుంటున్నా. జట్టు కోసం అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తా’ అని నితీశ్ రెడ్డి తెలిపాడు.