ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ చివరి దశకు చేరుకోగా.. ప్లేఆఫ్స్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం అహ్మదాబాద్‌లో జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మ్యాచ్‌పై భారీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ, హైదరాబాద్, గుజరాత్ జట్లు 14 పాయింట్లతో సమానంగా ఉండటంతో.. ఈ మ్యాచ్ ఫలితం టాప్-4 సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నెట్ రన్‌రేట్ కీలకంగా మారే పరిస్థితుల్లో ఎస్‌ఆర్‌హెచ్, జీటీ జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ సీజన్ ఆరంభంలో తడబడినా.. తర్వాత వరుస విజయాలతో బలంగా పుంజుకుంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌పై 77 పరుగుల భారీ విజయంతో జట్టు మూడో స్థానానికి ఎగబాకింది. గిల్‌తో పాటు సాయి సుదర్శన్ జట్టుకు అద్భుత ఆరంభాలు అందిస్తున్నారు. పవర్‌ప్లేలో జాగ్రత్తగా ఆడుతూ.. తర్వాత భారీ షాట్లతో పరుగుల వేగాన్ని పెంచడం గుజరాత్ ప్రత్యేకతగా మారింది. జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్ వంటి సీనియర్లు జట్టుకు మరింత బలం చేకూరుస్తున్నారు.
బౌలింగ్ విభాగంలో కూడా గుజరాత్ టైటాన్స్ బలంగా కనిపిస్తోంది. మొహమ్మద్ సిరాజ్, కాగిసో రబాడ తామ ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతుండగా.. రషీద్ ఖాన్ మధ్య ఓవర్లలో మ్యాచ్‌ను మలుపు తిప్పేస్తున్నాడు. ఇటీవల గుజరాత్ బౌలింగ్ బాగా మెరుగుపడింది. విదేశీ పేసర్లు భారత పరిస్థితులకు అలవాటు పడటంతో జట్టు మరింత ప్రమాదకరంగా మారింది. అయితే టాప్ ఆర్డర్ విఫలమైతే ఫినిషర్లపై అధికంగా ఆధారపడటం మాత్రం ఆ జట్టుకు ఇంకా సమస్యగానే ఉంది.
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో భీకర బ్యాటింగ్ లైనప్‌లలో ఒకటిగా నిలిచింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్‌లతో కూడిన టాప్ ఆర్డర్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఎనిమిది సార్లు 200కు పైగా స్కోర్లు నమోదు చేసిన హైదరాబాద్.. ముంబై ఇండియన్స్‌పై 249 పరుగులు చేసి తమ దూకుడు చూపించింది. ఇటీవల పంజాబ్ కింగ్స్‌పై 235/4 స్కోర్ చేసి.. 33 పరుగుల తేడాతో గెలవడం జట్టుకు భారీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.
కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తిరిగి జట్టులో చేరిన తర్వాత హైదరాబాద్ బౌలింగ్‌లో కూడా దూకుడు పెరిగింది. గాయం కారణంగా తొలి అర్ధ భాగానికి దూరమైన కమిన్స్ రీఎంట్రీ తర్వాత జట్టుకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు. అతడి గైర్హాజరీలో ఇషాన్ కిషన్ జట్టును నడిపించాడు. ఇక శ్రీలంక యువ పేసర్ ఈషాన్ మలింగ ఈ సీజన్‌లో సంచలనంగా మారాడు. కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ ఇప్పటివరకు 16 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్లలో ఒకడిగా నిలిచాడు.
అయితే హైదరాబాద్‌కు కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. అత్యంత దూకుడుగా ఆడే ప్రయత్నంలో టాప్ ఆర్డర్ త్వరగా అవుట్ అయితే మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. కొన్ని మ్యాచ్‌ల్లో అదే జట్టు పతనానికి కారణమైంది. ఫీల్డింగ్ కూడా కొంత ఆందోళన కలిగిస్తోంది. అయినప్పటికీ ప్రస్తుతం ఫామ్, ఆత్మవిశ్వాసం పరంగా ఇరు జట్లు సమానంగా కనిపిస్తున్నాయి. ప్లేఆఫ్స్ రేసు దృష్ట్యా ఈ మ్యాచ్ ఇప్పుడు మినీ నాకౌట్‌లా మారింది.
