ఐపీఎల్ 2022 సీజన్‌లో నేడు మరో ఆసక్తికర పోరు జరుగుతోంది. ప్రస్తుత సీజన్‌లో విజయం కోసం ఎదరుచూస్తున్న సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్ జట్లు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలినట్లైంది. 4వ ఓవర్ తొలి బంతికే రాబిన్ ఉతప్ప ఔట్ అయ్యి పెవిలియన్ చేరాడు. అంతేకాకుండా యార్కర్లతో నటరాజన్ అద్భుతమైన బంతితో రుతురాజ్ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రారంభం నుంచి వరుసగా వికెట్లు పడటంతో సీఎస్‌కే ఆటగాళ్లు ఆచితూచి పరుగుల కోసం ప్రయత్నం చేశారు.
దీంతో పరుగుల వేగం పెంచే క్రమంలో అంబటి రాయుడు వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు. వన్‌డౌన్ బ్యాటర్ మొయిన్ అలీ (48), ఆఖర్లో కెప్టెన్ జడేజా (23) మెరుపుల సాయంతో ఎస్‌ఆర్‌హెచ్‌పై చెన్నై సూపర్‌కింగ్స్ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్ల 7 వికెట్లను కొల్పోయిన సీఎస్‌కే 154 స్కోర్‌ను ఎస్‌ఆర్‌హెచ్ ముందు ఉంచింది.