SRH Playoffs Chances: టాప్‌ లేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇంకా ఒకే ఒక్క విజయం!

  • ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు
  • పంజాబ్‌ కింగ్స్‌పై 33 పరుగుల తేడాతో విజయం
  • పట్టికలో టాప్‌ లేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్
SRH Playoffs Chances

SRH Playoffs Chances

SRH Playoffs Chances in IPL 2026: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జోరు కొనసాగుతోంది. బుధవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై ఎస్‌ఆర్‌హెచ్ 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (55), హెన్రిచ్‌ క్లాసెన్‌ (69) అర్ధ సెంచరీలు బాదారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఆరంభంలో దూకుడుగా ఆడినా.. మిడిల్ ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. చివరికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. కూపర్‌ కనోలీ (107 నాటౌట్‌) పోరాటం వృధా అయింది.

ఈ గెలుపుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లి.. ప్లేఆఫ్స్‌ బెర్తుకు మరింత చేరువైంది. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచుల్లో 7 విజయాలు సాధించిన ఎస్‌ఆర్‌హెచ్.. 14 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. సొంత మైదానంలో ఇది హైదరాబాద్‌కు నాలుగో విజయం కావడం విశేషం. ప్రస్తుతం సన్‌రైజర్స్‌కు ఇంకా మూడు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అందులో ఒక్క విజయం సాధించినా.. 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్తు దాదాపు ఖాయం కానుంది. ఇక రెండు విజయాలు సాధిస్తే.. 18 పాయింట్లతో అధికారికంగా ప్లేఆఫ్స్‌లో స్థానం దక్కించుకుంటుంది.

పట్టికలో 18 పాయింట్స్ సాధిస్తే అదనపు ప్రయోజనం ఉంటుందన్న విషయం తెలిసిందే. అగ్ర స్థానంలో ఉన్న రెండు జట్లు క్వాలిఫైయర్-1లో తలపడుతాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడినా ఫైనల్ చేరేందుకు క్వాలిఫైయర్-2 రూపంలో మరో ఛాన్స్ ఉంటుంది. అందుకే టీమ్స్ టాప్-2లో ఉండేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఎస్‌ఆర్‌హెచ్ రెండు విజయాలు సాధిస్తే టాప్-2లో ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి. చూడాలి మరి సన్‌రైజర్స్ ఇదే జోరు కొసనాగిస్తుందో లేదో.