Sunrisers Hyderabad Opener Travis Head IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా హెడ్ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హెడ్ సెంచరీ బాది ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. బెంగళూరుపై 39 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలోనే ట్రావిస్ హెడ్ నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అగ్రస్ధానంలో ఉన్నాడు. గేల్ 30 బంతుల్లోనే శతకం బాదాడు. ఈ జాబితాలో యూసఫ్ పఠాన్ (37 బంతులు), డేవిడ్ మిల్లర్ (38 బంతులు) తర్వాతి స్ధానాల్లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో 41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సులతో హెడ్ విధ్వంసక శతకం చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు.
Also Read: Odisha : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 38 మందికి గాయాలు
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ విధ్వంసక శతకం సాధిస్తే.. హెన్రిచ్ క్లాసెన్ (67; 31 బంతుల్లో 2×4, 7×6) హాఫ్ సెంచరీ చేశాడు. ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (62; 28 బంతుల్లో 7×4, 4×6) హాఫ్ సెంచరీ చేయగా.. దినేశ్ కార్తీక్ (83; 35 బంతుల్లో 5×4, 7×6) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.