Navjot Singh Sidhu on Sanju Samson’s Controversial Dismissal: రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మద్దతుగా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూకు అన్యాయం జరిగిందన్నాడు. బంతి చేతిలో ఉండగానే షాయ్ హోప్ ఒకటి కాదు రెండుసార్లు బౌండరీ రోప్‌ను టచ్ చేశాడన్నాడు. అంపైర్ల నిర్ణయం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపిందని సిద్ధు పేర్కొన్నాడు. ఢిల్లీ మ్యాచ్‌లో సంజూ అవుట్ అయిన తీరు వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే.
రాజస్తాన్ ఛేదనలో ఢిల్లీ పీసర్ ముకేశ్ కుమార్ వేసిన 16వ ఓవర్ వేశాడు. ఆ ఓవర్లోని నాలుగో బంతికి సంజూ శాంసన్ లాంగాన్ వైపు భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్ వద్ద ఉన్న షాయ్ హోప్ క్యాచ్ అందుకున్నాడు. అయితే క్యాచ్ పట్టాక హోప్ ఎడమ పాదం బౌండరీ లైన్‌ను తాకినట్లు రీప్లేలో కనిపించింది. రీప్లే పరిశీలించాక థర్డ్ అంపైర్ సంజూను ఔటిచ్చాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి చెందిన సంజూ.. ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబానిదించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీనిపై టీమిండియా మాజీ ఓపెనర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధు రియాక్ట్ అయ్యాడు. స్టార్ స్పోర్ట్స్‌లో మాట్లాడుతూ… ‘సంజు శాంసన్‌ను అవుట్ ఇవ్వడం మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేసింది. సంజూ అవుట్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ సైడ్ యాంగిల్‌లో చూసినపుడు ఫీల్డర్ బౌండరీ లైన్‌ను రెండుసార్లు తాకినట్లు కనిపిస్తోంది. టెక్నాలజీని వాడకున్నా లేదా టెక్నాలజీని వాడినా.. అది తప్పు అని స్పష్టం. టెక్నాలజీ వల్ల తప్పిదం జరిగిందనే చెప్తాను. ఈ నిర్ణయం.. పాలలో ఈగ ఉన్నా మిమ్మల్ని తాగమని అడిగినట్లు ఉంది’ అని సిద్ధు అన్నాడు.
Also Read: Apple iPad Air: యాపిల్ నుంచి సరికొత్త ‘ఐప్యాడ్ ఎయిర్’.. ప్రత్యేక ఆకర్షణగా ఎం2 ప్రాసెసర్!
‘షాయ్ హోప్ పాదం రెండుసార్లు బౌండరీ లైన్‌ను తాకింది. ఎవరైనా దీన్ని ఔట్ అనే చెబుతారు. నేను తటస్థంగా ఉండే వ్యక్తిని. సంజూ నాటౌట్ అని కచ్చితంగా చెబుతున్నా. విరాట్ కోహ్లీ నో బాల్‌కు అవుట్ అయ్యాడు. కొన్ని సాక్ష్యాలు నమ్మడానికి చాలా బలమైనవిగా ఉంటాయి. అంపైర్లు ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని నేను అనుకోవడం లేదు. ఎవరి తప్పు లేకపోయినా ఇక్కడ సంజూ శాంసన్ బలైపోయాడు. ఆటలో ఇవన్నీ సహజమే. ఏదేమైనా ఈ నిర్ణయం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది’ అని నవ్‌జోత్ సింగ్ సిద్ధు పేర్కొన్నాడు.