Jos Buttler goes past Chris Gayle in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా బట్లర్ నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ సెంచరీ చేసి ఈ రికార్డు తన పేరుపై లిఖించుకున్నాడు. 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సులతో 107 పరుగులు చేశాడు. ఆశలు అడుగంటిన వేళ.. వీరోచిత శతకంతో కోల్‌కతాను ఒక్కడై ఓడించాడు.
ఓవరాల్‌గా జోస్ బట్లర్‌కు ఇది ఏడో ఐపీఎల్ సెంచరీ. దాంతో ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. గేల్ ఐపీఎల్‌లో 6 సెంచరీలు చేశాడు. ఇక ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో తొలి స్ధానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ 8 శతకాలు బాదాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు గేల్‌తో సమానంగా ఉన్న బట్లర్.. ఇప్పుడు రెండో స్థానంకు దూసుకొచ్చాడు.
Also Read: UAE Rains: యూఏఈలో భారీ వర్షాలు.. ఒమన్‌లో 18 మంది మృతి!
ఈ మ్యాచ్‌లో మొదట కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసింది. సునీల్ నరైన్ (109; 56 బంతుల్లో 13×4, 6×6) సెంచరీ బాదాడు. 224 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జోస్ బట్లర్ (107 నాటౌట్; 60 బంతుల్లో 9×4, 6×6) వీరోచిత శతకంతో చెలరేగాడు. గెలుపు ఆశల్లో తేలుతున్న కోల్‌కతా ఆటగాళ్లకు బట్లర్ చుక్కలు చూపిస్తూ.. రాజస్థాన్‌కు ఊహించని విజయం అందించాడు.