Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు ఒక సంచలనంగా మారింది. రికార్డులను తిరగరాయడమే పనిగా పెట్టుకున్న ఈ 15 ఏళ్ల కుర్రాడు, రోజు రోజుకూ కొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన సూర్యవంశీ, తాజాగా మరో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 40 బంతుల కంటే తక్కువ వ్యవధిలో రెండు ఐపీఎల్ సెంచరీలు (2025లో గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో, 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లో) బాదిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. ఇక, శనివారం నాటి మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్ వేసిన తొలి బంతికే సిక్స్ కొట్టి టీ20ల్లో వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం 514 బంతుల్లోనే ఈ ‘సిక్సర్ల సెంచరీ’ మార్కును అందుకోవడం విశేషం. అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా వైభవ్ చరిత్రకెక్కాడు.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ 16 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. విశేషమేమిటంటే, ఈ మూడు సిక్సర్లు పవర్‌ప్లేలోనే వచ్చాయి. దీనితో ఒక ఐపీఎల్ సీజన్‌లో పవర్‌ప్లే (1-6 ఓవర్లు)లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా వైభవ్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం 30 సిక్సర్లతో అతను అగ్రస్థానంలో ఉండగా, అభిషేక్ శర్మ (2024లో 29 సిక్సర్లు, 2026లో 27 సిక్సర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. గతంలో సనత్ జయసూర్య (2008), ట్రావిస్ హెడ్ (2024), యశస్వి జైస్వాల్ (2025) తలో 22 సిక్సర్లతో ఈ జాబితాలో ఉండేవారు.
మరోవైపు, జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన నిన్నటి పోరులో గుజరాత్ టైటాన్స్ పరుగుల వరద పారించింది. గాయపడిన రియాన్ పరాగ్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన యశస్వి జైస్వాల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 44 బంతుల్లో 84 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, సాయి సుదర్శన్ (36 బంతుల్లో 55) రాణించాడు. చివరలో వాషింగ్టన్ సుందర్ (20 బంతుల్లో 37) మెరుపులు మెరిపించడంతో గుజరాత్ స్కోరు 200 దాటింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
