Hardik Pandya: “సాకులు చెప్పను.. మేం తప్పు చేశాం”.. ముంబై వైఫల్యాలపై హార్దిక్ ఓపెన్ టాక్!

Hardik Pandya

Hardik Pandya

Hardik Pandya: ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అద్భుత విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, పాయింట్ల పట్టికలో రెండు స్థానాలు ఎగబాకడమే కాకుండా తమ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన జట్టు ప్రదర్శనపై, ముఖ్యంగా ఫీల్డింగ్ వైఫల్యాలపై చాలా ఓపెన్‌గా మాట్లాడాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రెజెంటేషన్‌లో హార్దిక్ జట్టు తప్పులను ఒప్పుకున్నాడు. ఇక నిన్నటి మ్యాచ్‌లో బౌలర్లకు పిచ్‌ అనుకూలించడంపై సంతోషం వ్యక్తం చేశాడు. “ఈ మ్యాచ్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. కానీ బ్యాటింగ్‌లో మేము తడబడ్డాం. మేము ఖచ్చితంగా ఒక 20 పరుగులు తక్కువ చేశాం. పవర్‌ప్లేలోనే మేము చాలా వికెట్లు కోల్పోయాం. ఒకవేళ తిలక్ వర్మ, నేను క్రీజులో ఎక్కువసేపు నిలిచి, మరికొన్ని భాగస్వామ్యాలు (partnerships) నెలకొల్పి ఉంటే.. ఆ అదనంగా 15-20 పరుగులు వచ్చేవి. అప్పుడు మాకు గెలిచేందుకు మంచి అవకాశం ఉండేది” అని హార్దిక్ పాండ్యా విశ్లేషించాడు.

ఇక పిచ్ ఎలా ఉందనే ప్రశ్నకు హార్దిక్ స్పందిస్తూ.. “నిజాయితీగా చెప్పాలంటే.. బౌలర్లకు ఈ పిచ్‌ అద్భుతంగా ఉంది. ఇలాంటి పిచ్‌లపై ఆడటం నాకు ఇష్టమే. ప్రస్తుత ఐపీఎల్ పూర్తిగా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యంగా మారిపోతోంది. దీనివల్ల బౌలర్లు చాలా నిస్సహాయంగా ఫీలవుతున్నారు. కానీ ఈరోజు మ్యాచ్‌లో పిచ్ నుంచి బౌలర్లకు కూడా మంచి సపోర్ట్ దొరికింది. దాంతో అద్భుతంగా బౌలింగ్ వేయగలిగారు. బ్యాట్స్‌మెన్స్ సైతం చక్కటి ప్రదర్శన కనబరిచి పరుగులు చేయాల్సి వచ్చింది. అందుకే ఈ పిచ్‌పై ఆడటాన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను” అని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో ముంబై జట్టు ఫీల్డింగ్ పట్ల హార్దిక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సీజన్ మొత్తం తమ ఫీల్డింగ్ చాలా అధ్వాన్నంగా ఉందన్నాడు. తాము చాలా క్యాచ్‌లు వదిలేశామని గుర్తు చేసుకున్నాడు. నిజానికి క్యాచ్‌లు ఎవరూ కావాలని వదలరు, కానీ ఈ సీజన్‌లో మా ఫీల్డింగ్ సరిగ్గా లేదన్నాడు. తప్పు ఒప్పుకోవడం తప్ప తప్పించుకోవడానికి ఎలాంటి సాకులు లేవని ఓపెన్‌గా చెప్పాడు. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే క్యాచ్‌లను వదిలేసినప్పుడు గెలవడం అంత సులువు కాదని హితవు పలికాడు.