IPL 2027: ఐపీఎల్ 2026 తర్వాత భారీ మార్పులు.. కెప్టెన్స్, కోచ్‌లు మూల్యం చెల్లించుకోక తప్పదు!

  • మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్న ఫ్రాంచైజీలు
  • కెప్టెన్స్, కోచింగ్ స్టాఫ్, కీలక ఆటగాళ్ల భవిష్యత్తుపై ఊహాగానాలు
  • ఎంఎస్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై చర్చ
IPL 2026 Playoffs Scenarios

IPL 2026 Playoffs Scenarios

Big Decisions Across Teams Ahead of IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటుండగా.. తదుపరి సీజన్ కోసం ఫ్రాంచైజీలు పెద్ద ఎత్తున మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నాయనే వార్తలు క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్స్, కోచింగ్ స్టాఫ్, కీలక ఆటగాళ్ల భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు జట్లలో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం.

ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌:
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎన్నో విజయాలు అందించిన ధోనీ.. ఈ సీజన్ అనంతరం తన ఐపీఎల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని సమాచారం. అతని స్థానంలో కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలని జట్టు యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

గైక్వాడ్ కెప్టెన్సీపై సందేహాలు:
చెన్నై సూపర్ కింగ్స్‌ సారథి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతడిని బాధ్యతల నుంచి తప్పించి.. సంజు శాంసన్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించే అవకాశాలపై చర్చ జరుగుతోంది. ఇది నిజమైతే సీఎస్‌కేలో పెద్ద మార్పుగా భావించాలి.

మేనేజ్‌మెంట్‌లో కూడా మార్పులు:
పలు జట్ల మేనేజ్‌మెంట్‌లో కూడా మార్పులు ఉండవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్, కోచ్ లక్ష్మీపతి బాలాజీలను బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉందని సమాచారం. అలాగే సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్‌పై కూడా ఒత్తిడి పెరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పంత్‌, రహానేలపై వేటు:
కెప్టెన్ రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ జట్టు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అతని ప్రదర్శన, జట్టు సమతుల్యతపై మేనేజ్‌మెంట్ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌లో అజింక్య రహానే, కోచ్ అభిషేక్ నాయర్ స్థానాలు ప్రమాదంలో ఉన్నాయని సమాచారం. జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం ఈ నిర్ణయాలకు కారణమవుతోంది.

హార్దిక్, పరాగ్‌ అవుట్:
రాజస్థాన్ రాయల్స్‌లో కూడా పెద్ద మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. రియాన్ పరాగ్‌ను జట్టు నుంచి తప్పించి.. యువ స్టార్ యశస్వి జైస్వాల్‌కు కెప్టెన్సీ అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ముంబై ఇండియన్స్‌లో కూడా కెప్టెన్సీ మార్పు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యను బాధ్యతల నుంచి తప్పించి.. స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ అప్పగించే అవకాశాలపై చర్చ జరుగుతోంది.