IPL 2026 Final: ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫినాలే.. ‘కింగ్’ కోహ్లీ మళ్లీ మెరుస్తాడా?

  • ఆఖరి అంకానికి చేరుకున్న ఐపీఎల్ 2026 సీజన్
  • ఐపీఎల్ 2026 ఫైనల్లో ఢీకొట్టబోతున్న ఆర్సీబీ, జీటీ
  • అందరి దృష్టి 'కింగ్' విరాట్ కోహ్లీపైనే
Virat Kohli

Virat Kohli

IPL 2026 Final RCB vs GT: రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని ప్రతిష్టాత్మక నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగబోయే మహా సంగ్రామంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ), 2022 విజేత గుజరాత్‌ టైటాన్స్‌ (జీటీ) జట్లు ఢీకొనబోతున్నాయి. ఈ టోర్నీలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండు బలమైన జట్ల మధ్య ఫైనల్‌ జరుగుతుండడంతో.. ఈసారి ట్రోఫీని ఎవరు ముద్దాడుతారనేది ఉత్కంఠభరితంగా మారింది. ఫైనల్ నేపథ్యంలో అందరి దృష్టి ‘కింగ్’ విరాట్ కోహ్లీపైనే ఉంది.

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ బ్యాటర్ల ఫామ్‌ తగ్గడం సహజం. గతంలో విరాట్ కోహ్లీ సైతం ఇలాంటి గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నాడు. కానీ ఒక్కసారి లయ అందుకున్న ఈ రన్ మెషిన్.. గత రెండేళ్లుగా మైదానంలో పరుగుల వరద పారిస్తున్నాడు. యువ బ్యాటర్ల హవా నడుస్తున్న ప్రస్తుత ఐపీఎల్‌లో.. తన క్లాస్ బ్యాటింగ్‌తో బలమైన ముద్ర వేసిన సీనియర్‌ బ్యాటర్లలో విరాట్ అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే 600 పైగా పరుగులు సాధించి కింగ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తాను వేగంగా ఆడలేడనే విమర్శలకు గట్టి సమాధానం ఇస్తూ.. ఏకంగా 164.38 స్ట్రైక్‌ రేట్‌తో పరుగులు చేశాడు.

×
×
Ad

బిగ్ మ్యాచ్‌ల్లో ఒత్తిడిని అధిగమించి, అంచనాలకు తగ్గట్టుగా రాణించడం విరాట్‌ కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య. ఆర్సీబీ గత రికార్డులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. గత ఏడాది ఫైనల్లో ఆర్సీబీ జట్టులో 43 పరుగులతో కోహ్లీనే టాప్‌ స్కోరర్‌గా నిలిచి జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఈ సీజన్ క్వాలిఫయర్-1లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 43 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ప్రస్తుతం ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ ఒక ఎండ్‌లో యాంకర్‌ పాత్ర పోషిస్తుంటే.. మిగతా బ్యాటర్లు ఫ్రీగా చెలరేగి ఆడుతున్నారు. వెంకటేశ్‌ అయ్యర్, దేవదత్ పడిక్కల్, రజత్‌ పాటీదార్‌ ధాటిగా ఆడుతున్నారు. అదే సమయంలో అవసరమైనప్పుడు కింగ్ సైతం గేర్ మార్చి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఆదివారం జరగబోయే ఫైనల్ పోరులో కూడా ‘కింగ్‌’ తనదైన శైలిలో చెలరేగి.. ఆర్సీబీకి వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్‌ను అందిస్తాడని అభిమానులు ధీమాగా ఉన్నారు.