Abhishek Sharma Chasing David Warner’s SRH Record: ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం ఉప్పల్ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) సూపర్ విక్టరీ సాధించింది. ముందుగా సన్‌రైజర్స్ 2 వికెట్లకు 242 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులే చేసి 47 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఎస్‌ఆర్‌హెచ్ విజయంలో ఓపెనర్ అభిషేక్ శర్మ (135 నాటౌట్) కీలక పాత్ర పోషించాడు. 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సులతో విధ్వంసక శతకం బాదిన అభిషేక్.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. దాంతో అభిషేక్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యధిక సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకొన్న మూడో ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డుల్లో నిలిచాడు. ఇప్పటివరకు అభిషేక్ 7 సార్లు అవార్డు అందుకున్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. డేవిడ్ భాయ్ మొత్తం 12 సార్లు ఈ అవార్డు గెలుచుకుని ఎస్‌ఆర్‌హెచ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. వార్నర్ సారథ్యంలోనే సన్‌రైజర్స్ 2016లో కప్ కొట్టిన విషయం తెలిసిందే.
రెండో స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ ఉన్నాడు. అతడు 8 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మూడో స్థానంలో ప్రస్తుతం జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్న అభిషేక్ శర్మ ఉన్నాడు. అభిషేక్ ఇప్పటివరకు 7 అవార్డులు గెలుచుకుని.. ఈ జాబితాలో దూసుకొస్తున్నాడు. అతని ఫామ్ చూస్తే త్వరలోనే టాప్ స్థానాన్ని అందుకునే అవకాశం ఉంది. టీమిండియా సీనియర్ భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్, అలాగే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇద్దరూ తలో 6 అవార్డులతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో, భారత స్పిన్నర్ అమిత్ మిశ్రా తలో 4 అవార్డులతో తమ ముద్ర వేశారు.
శిఖర్ ధావన్, ట్రావిస్ హెడ్ తలో 3 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లు తలో 2 అవార్డులతో జట్టుకు సేవలందించారు. ఇక ఒక్కోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాళ్ల జాబితా చాలా పెద్దదే. ఇందులో హెన్రిచ్ క్లాసెన్, మహ్మద్ సిరాజ్, గ్లెన్ ఫిలిప్స్, జాసన్ రాయ్, డేల్ స్టెయిన్, యువరాజ్ సింగ్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో ఎన్నో మ్యాచ్ విన్నర్లు ఉన్నప్పటికీ.. ఇప్పుడు రారాజు మాత్రం వార్నర్. యువ ఆటగాడు అభిషేక్ దూసుకెళ్తున్న తీరు చూస్తే.. భవిష్యత్తులో ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
