ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ప్రారంభ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సాయంత్రం 7.30 గం.కు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఈ సీజన్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. గత సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయాస్ అయ్యర్.. పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా.. ఈ సీజన్ నుంచి అజింక్య రహానేకు కేకేఆర్ జట్టు పగ్గాలు అప్పజెప్పారు. అంతేకాకుండా.. జట్టులో మరికొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. గౌతమ్ గంభీర్ భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యాక.. డ్వేన్ బ్రావో కేకేఆర్ మెంటర్‌గా నియమితులయ్యారు.
Read Also: Black Tickets: ఉప్పల్లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందా.. ఒకరు అరెస్ట్
కేకేఆర్ భారీ అంచనాలు
గత సీజన్ కేకేఆర్ ఎక్కువ డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్‌ను వదిలేసింది. అతను ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తరుఫున ఆడనున్నాడు. అతని స్థానంలో కేకేఆర్ అన్రిచ్ నార్ట్జేను జట్టులోకి తీసుకుంది. మరోవైపు.. ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను కోల్‌కతా తీసుకుంది. అయితే.. గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో అతని స్థానంలో చేతన్ సకారియాను తీసుకున్నారు. కాగా.. గత ఏడాది రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేసిన వెంకటేష్ అయ్యర్‌పై కేకేఆర్ ఈ సీజన్‌లో మరింత ఆశలు పెట్టుకుంది.
టైటిల్ కోసం పోటీ
మరోవైపు ఆర్సీబీ విషయానికొస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కూడా కొన్ని పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. రజత్ పాటిదార్ కెప్టెన్‌గా కొత్త యుగంలోకి అడుగుపెట్టారు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌ను రన్నరప్‌గా చేర్చిన పాటిదార్.. ఈ సీజన్ నుంచి ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఆర్సీబీ తమ బ్యాటింగ్ లైనప్‌ను బలోపేతం చేసుకోవడం కోసం కేకేఆర్ నుంచి ఫిల్ సాల్ట్‌ను జట్టులోకి తీసుకుంది. అలాగే, అనుభవజ్ఞులైన ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్‌లతో బౌలింగ్ విభాగంలో బలంగా ఉంది. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఆర్సీబీ ఇంకా టైటిల్ సాధించలేదు.. ఈ సీజన్‌లోనైనా టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. దీంతో.. కేకేఆర్, ఆర్సీబీ మధ్య పోరు మరింత ఉత్కంఠగా మారనుంది.
ఇండియాలో KKR vs RCB మ్యాచ్‌ను ఎప్పుడు చూడొచ్చంటే..?
ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు.. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభమవుతుంది.
లైవ్ ఎక్కడ చూడాలి..?
ఈ మ్యాచ్ టెలికాస్టింగ్ హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ కలిగి ఉంది. వీక్షకులు స్టార్ స్పోర్ట్స్ 1 SD, స్టార్ స్పోర్ట్స్ 1 HD, స్టార్ స్పోర్ట్స్ 2 SD, స్టార్ స్పోర్ట్స్ 2 HD, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ SD, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ HD, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళ్ SD, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళ్ HD, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు SD, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు HD, స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడ SD, స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడ HD లలో మ్యాచ్‌లను చూడవచ్చు. మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ జియోస్టార్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.