Graeme Smith Praises Sunil Narine Performance in IPL 2024: ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఆటగాడు సునీల్ నరైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. స్పిన్నర్ అయినా స్టార్ బ్యాటర్‌లా చెలరేగుతున్నాడు. సిక్స్‌లు, ఫోర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. కేకేఆర్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న నరైన్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన నరైన్.. 183.67 స్ట్రైక్‌రేట్‌తో 461 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
సునీల్ నరైన్ ఆటపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. నరైన్ చాలా ప్రమాదకర ఆటగాడని, అతడికి ఐపీఎల్ 2024 ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ పక్కాగా వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ‘సునీల్ నరైన్‌ను కట్టడి చేయడానికి లక్నో ఏదైనా ప్లాన్‌తో వచ్చిందో, లేదో నాకు తెలియదు. నరైన్‌కు బౌలింగ్ చేస్తున్నప్పుడు ప్లాన్‌తో వచ్చినట్టు కనిపించలేదు. కోల్‌కతా బౌలర్లు ఎలా బౌలింగ్ చేసినా.. నరైన్ మైదానం నలువైపులా భారీ షాట్స్ ఆడాడు. అతడు క్రీజులో కుదురుకున్నాడంటే.. చాలా ప్రమాదకరంగా మారతాడు. ఈ సీజన్‌లో మంచి ప్రదర్శనలు చేస్తూ చాలా ఆత్మవిశ్వాసాన్ని పొందుతున్నాడు. ఇప్పటివరకైతే ఈ సీజన్‌లో నరైన్‌కే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. అందులో ఎలాంటి సందేహం లేదు’ అని స్మిత్ అన్నాడు.
Also Read: T20 World Cup 2024: భారత ఆటగాళ్లకు ఏమైంది.. ప్రపంచకప్‌కు ఎంపికయితే ఆడరా?
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరడం దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం కేకేఆర్ 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలను నమోదు చేసింది. 16 పాయింట్లతో ఇప్పుడు పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా అధికారిక బెర్త్ దక్కుతుంది. ఒకవేళ మూడింట్లో ఓడినా ప్లేఆఫ్స్ చేరుతుంది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో నరైన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81 రన్స్ చేశాడు. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల్లో నరైన్ ఇదే దూకుడు కొనసాగిస్తే.. టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.