Chennai Super Kings Bowlers News in IPL 2024: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు భారీ షాక్ తగిలింది. వివిధ కారణాలతో ఐదుగురు సీఎస్‌కే స్టార్ బౌలర్లు జట్టుకు దూరం అయ్యారు. దీపక్ చహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రహ్మాన్, మతీషా పతిరణా, మహేశ్ తీక్షణ ప్రస్తుతం జట్టుకు అందుబాటులో లేరు. ఈ ఐదుగురు తిరిగి జట్టులోకి ఎప్పుడు వస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న చెన్నైకి ఇలా ఒకేసారి బౌలర్లు అందరూ దూరమవడం భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
జింబాబ్వేతో బంగ్లాదేశ్ ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ముస్తాఫిజుర్ రహ్మాన్ స్వదేశానికి వెళ్తున్నాడు. జింబాబ్వేతో సిరీస్ మే 12తో ముగిసినా.. 20 నుంచి అమెరికాతో బంగ్లా మరో టీ20 సిరీస్ ఆడనుంది. దాంతో ముస్తాఫిజుర్ ఐపీఎల్ 2024లో ఆడడం దాదాపు అసాధ్యమే. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చహర్ గాయపడ్డాడు. మొదటి ఓవర్లో రెండు బంతులే వేసి.. మైదానాన్ని వీడాడు. చహర్ గాయం గురించి ఎలాంటి సమాచారం లేదు. అతడు కోలుకోవడానికి కనీసం 4-5 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది.
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందే తుషార్ దేశ్‌పాండే అనారోగ్యానికి గురయ్యాడు. అతడు ఎప్పుడు జట్టులో చేరుతాడో క్లారిటీ లేదు. ఇక శ్రీలంక స్టార్ బౌలర్లు మతీషా పతిరణా, మహేశ్ తీక్షణలు టీ20 ప్రపంచకప్ 2024 వీసా ప్రాసెస్ కోసం చెన్నై జట్టును వీడారు. ఈ ఇద్దరు ఎంట్రీపై కూడా సమాచారం లేదు. మొత్తానికి ఐదుగురు బౌలర్లు ఒక్కసారిగా అందుబాటులో లేకపోవడం అటు చెన్నై యాజమాన్యం, ఇటు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. అయిదింట్లో గెలిచి పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.