Matheesha Pathirana Says MS Dhoni is playing my father’s role: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో ఎందరో క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. భారత ప్లేయర్స్ మాత్రమే కాదు.. విదేశీ ఆటగాళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. శ్రీలంక బౌలర్, జూనియర్ మలింగ మతీశా పతిరన అందులో ఒకడు. 2022లో అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చిన పతిరన.. 2023లో 12 మ్యాచ్‌లలో 19 వికెట్లు పడగొట్టాడు. ఇక 2024లో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం సీఎస్‌కే ప్రధాన పేసర్లలో ఒకడిగా ఎదిగాడు. పతిరన ఎదుగుదలకు కారణం ధోనీనే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తడబడిన ప్రతిసారి మహీ అతడికి అండగా నిలిచాడు.
తాజాగా సీఎస్‌కే ‘లయన్స్ అప్‌క్లోజ్’ చాట్‌లో మతీశా పతిరన మాట్లాడుతూ ఎంఎస్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. మహీ అందించిన ప్రోత్సాహం ఎప్పటికీ మరువనని, ధోనీ తనకు తండ్రి లాంటి వారని పేర్కొన్నాడు. ‘నా క్రికెట్ జీవితంలో నా తండ్రి తర్వాత ఆ పాత్రను పోషిస్తున్న వ్యక్తి ధోనీ. ఎప్పుడూ నా గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు నడిపిస్తున్నాడు. నేను ఇంటి వద్ద ఉన్నప్పుడు మా నాన్న ఎలా అయితే నాతో ఉంటారో.. ఇక్కడ ధోనీ అలా ఉంటారు. మైదానంలో కానీ లేదా బయట కానీ అది చెయ్ ఇది చెయ్ అని చెప్పరు. అవసరమైన విషయాలను మాత్రమే చెబుతారు. ఆ మాటలు వినేందుకు చాలా చిన్నవిగా అనిపించినప్పటికీ.. ప్రతీ మ్యాచ్‌లోనూ నా విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎప్పుడు ఏ అనుమానం ఉన్నా.. ధోనీని అడుగుతా. ఆయన సమాధానం చెబుతారు’ అని పతిరన చెప్పాడు.
Aslo Read: OnePlus 12 Price Drop: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. వన్‌ప్లస్ 12పై భారీ తగ్గింపు!
ఐపీఎల్ 2024లో మతీశా పతిరన 6 మ్యాచుల్లో 13 వికెట్లు పడగొట్టాడు. జూనియర్ మలింగ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 20 మ్యాచ్‌లలో 34 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ బౌలింగ్ యాక్షన్‌ను పతిరన అచ్చు దింపుతాడు. యార్కర్లతో మేటి బ్యాటర్లను సైతం బోల్తా కొట్టిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 వీసా కోసం స్వదేశం వెళ్లిన పతిరన.. త్వరలోనే జట్టుతో కలవనున్నాడు.